మాచర్ల పోరు.. వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్లలో ఓటమి భయంతోనే టీడీపీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి అరాచకాలకు తెరతీసిందని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.. మా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, బీ ఫారాలు చించేసినా వెనక్కి తగ్గకుండా బీరువా గుర్తుతో ప్రజల్లోకి వెళ్లి మద్దతు కోరుతున్నామన్నారు. జగనన్న ఆదేశాల మేరకు మైనారిటీ మహిళ సుల్తానాను చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిలబెట్టామని పేర్కొన్నారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఏజెంట్ ఫారాల సమర్పణ సమయంలో రౌడీ, గంజాయి బ్యాచ్‌లతో మా అభ్యర్థులు, నాయకులపై దాడులు చేయించారన్నారు. ఎన్నికల అధికారి, కమిషనర్, పోలీసులు చూస్తూ ఉండిపోయారని, టీడీపీ గూండాల దాడులను ఆపలేడని విమర్శించారు. పల్నాడు జిల్లాలో కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, నాగార్జునసాగర్ ఎస్‌ఐలు సైతం టీడీపీ ఏజెంట్లలా వ్యవహరిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని, నామినేషన్లు వేస్తే గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.

సంబంధం లేని వారిని సైతం బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారన్నారు. ఈ ఘటనలపై ఆధారాలతో జిల్లా ఎస్పీకి, ఎస్‌ఈసీకి ఫిర్యాదులు పంపించామని పేర్కొన్నారు. దాడులకు పాల్పడినవారు, వెనుకుండి నడిపించినవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. మాచర్ల అభివృద్ధి వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు.
జాతీయ రహదారి రింగ్ రోడ్డు నిర్మాణం, 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు పెంచి, 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే ప్రతిపాదన, 5,400 మంది పేదలకు రిజిస్ట్రేషన్‌తో ఇళ్ల పట్టాల పంపిణీ మా ప్రభుత్వంలోనే చేపట్టాం. మిగిలిన పేదలందరికీ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల పట్టాలు అందిస్తామని మా అభ్యర్థులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు.
వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 66 లక్షల 40 వేలకుపైగా పెన్షన్లు అందుతుండగా, కూటమి అధికారంలోకి రాగానే 6 లక్షల 40 వేల పెన్షన్లు తొలగించి, అదే డబ్బుతో రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మాచర్ల నియోజకవర్గంలోనే 6,400 మందికిపైగా తల్లులకు అమ్మఒడి నిలిపివేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను అమలు చేయలేదన్నారు.
ప్రజలు హామీల గురించి ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. 11వ వార్డులో ప్రజలు నిలదీసినప్పుడు మా పార్టీ నాయకుడు అగ్గిరాముడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు.నామినేషన్ వేసినప్పటి నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే నాపై 18 కేసులు ఉండగా, తాజాగా మరో కేసు పెట్టి 19కు చేర్చారు. గతంలో బుర్రిపాలెం జంట హత్యల కేసులో అన్యాయంగా ఇరికించి 98 రోజులు జైలులో పెట్టారు. ఇప్పుడు అదే కేసును సాకుగా చూపి బెయిల్ రద్దు చేయిస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు.
ఎన్ని కేసులు పెట్టినా, బెయిల్ రద్దు చేసినా భయపడే ప్రసక్తే లేదు. ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు ఎదురైనా వైయస్ఆర్‌సీపీకి చెందిన 36 మంది అభ్యర్థులు జగనన్న నాయకత్వంపై నమ్మకంతో పోటీలో నిలిచారన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని అన్ని ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
