బాబుకు షాక్: తెరాసలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మరో షాక్. పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యులు, రంగారెడ్డి జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలు శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కెసిఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రస్తుతం తాండూరు ఎమ్మెల్యేగా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యేగా కెఎస్ రత్నంలు ఉన్నారు. వారు 2009లో టిడిపి పార్టీ తరఫున గెలుపొందారు. ఇప్పుడు కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. మహేందర్ రెడ్డి టిడిపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో టిడిపి నుండి పలువురు సీనియర్ నేతలు తెరాసలోకి గత కొంతకాలంగా వెళ్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం కెసిఆర్‌తోనే సాధ్యమని భావిస్తూ పలువురు నేతలు కారెక్కుతున్నారు. వీరే కాకుండా తెలంగాణలోని పది జిల్లాల నుండి పలువురు టిడిపి నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరాసను కాంగ్రెసు పార్టీలో విలీనం చేసేందుకు కెసిఆర్ ఆసక్తి కనబర్చడం లేదు.












Click it and Unblock the Notifications