రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
జీవితంలో ఏదైనా సాధించాలనే కసి ఉంటే చదువు, ఇతర అర్హతలతో సంబంధం లేకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అలాంటివారిలో పశ్చిమ బెంగాల్ లోని కుచ్ బెహార్ జిల్లాలో ఓ చిన్న గ్రామానికి చెందినవారు మలయ్ దేబ్ నాథ్. ఆరు సంవత్సరాల వయసులో వారి కుటుంబ వ్యాపారం అగ్ని ప్రమాదానికి గురైంది. దీనికి కారణం రాజకీయ వివాదం. మలయ్ కుటుంబంలో ఈ సంఘటన పెద్ద విషాదాన్ని నింపింది. తిరిగి ఆ వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ కోలుకోలేకపోయారు.
తర్వాత దేబ్ నాత్ తన గ్రామంలో ఉండే టీ వ్యాపారాన్ని చూసుకున్నాడు. 12వ తరగతి చదివే వరకు దీన్నే కొనసాగించాడు. తర్వాత చదువును విడిచిపెట్టి తల్లి వద్ద రూ.100 తీసుకొని ఢిల్లీకి వెళ్లాడు. క్యాటరర్ పనిచేస్తూ తన సంపాదన తాను సంపాదించుకునేవాడు. పాత్రలు శుభ్రం చేయడం, టేబుల్స్ తుడవడం లాంటి పనులన్నీ చేశాడు. అలా చేసి పనిచేసే యజమాని అభిమానాన్ని సంపాదించాడు. దీంతో దేబ్ నాథ్ వేతనం రూ.500 నుంచి రూ.3వేలకు పెరిగింది. రోజుకు 18 గంటలు పనిచేసి కుటుంబానికి డబ్బులు పంపించేవాడు.

ఢిల్లీకి చెందిన ఈ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో సూపర్‌వైజర్ స్థాయికి ఎదిగాడు. ఇలా ఎదిగే క్రమంలోనే హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోర్సును పూర్తి చేశాడు. అలా పనిచేస్తూనే పరిచయాలు పెంచుకొని సొంతంగా క్యాటరింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అలా దేబ్‌నాథ్ క్యాటరర్స్ అండ్ డెకరేటర్స్ పేరుతో ఏర్పాటైన కంపెనీ పెద్ద విజయాన్ని సాధించడమేకాదు.. మంచి లాభాలను కూడా ఆర్జించిపెట్టింది.
ఈ సంస్థ ప్రస్తుతం ఢిల్లీ, పూణే, జైపూర్, అజ్మీర్, గ్వాలియర్ సహా 35 కంటే ఎక్కువ ఆర్మీ మెస్ సౌకర్యాలను నిర్వహిస్తోంది. ఉత్తర బెంగాల్‌లోని టీ తోటలతో సహా సుమారు రూ.200 కోట్ల నికర విలువను కలిగివున్నాడు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నాడు. అచంచలమైన కృషితోపాటు సంకల్పం, కసితో పనిచేశాడు. యువతకు అతని జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications