మహిళా గ్రామ వాలంటీర్ వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్త హత్య...
నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళా గ్రామ వాలంటీర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి జాతీయ రహదారిపై పడేశారు. ఆపై ఆమె ఏమీ ఎరగనట్లు నటించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు బండారం బయటపడక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కోవూరులో బండికాల రవీంద్ర-సమత అనే దంపతులు చాలాకాలంగా నివసిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు సంతానం. రవీంద్ర అల్లూరు మండలంలోని ఓ చర్చికి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. సమత కోవూరులోని శాంతినగర్-2 ప్రాంతంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది.

కొంతకాలంగా రాము అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త ఇంట్లో లేనప్పుడు అతన్ని ఇంటికి పిలిపించుకునేది. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీ రాత్రి రామును ఇంటికి పిలిపించుకుంది. భర్త ఇంట్లో లేకపోవడంతో అతనితో ఏకాంతంగా గడిపింది. అయితే హఠాత్తుగా అర్థరాత్రి వేళ ఇంటికొచ్చిన భర్త రవీంద్ర... భార్య వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసి షాక్ తిన్నాడు. ఆగ్రహంతో భార్య సమతను నిలదీశాడు. దీంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని సమత,రాము ఆందోళన చెందారు.ఇద్దరు కలిసి రవీంద్ర ముఖంపై గట్టిగా దిండు అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి అతన్ని హత్య చేశారు.
హత్యానంతరం రాము ఆటోలో మృతదేహాన్ని తరలించి జాతీయ రహదారిపై పడేసి వెళ్లిపోయారు.ఆ మరుసటిరోజు సమత ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాము మృతదేహాన్ని గుర్తించి సమతకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పరిశీలించాక అది తన భర్తదేనని ఆమె పోలీసులతో చెప్పింది. అతని ఒంటిపై గాయాలు ఉండటంపై అనుమానం వ్యక్తం చేసింది. అయితే అతనికి ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందాడని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సమతను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రియుడు రాముతో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో సమత,రాములపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అటు తండ్రి హత్య... ఇటు తల్లి జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.












Click it and Unblock the Notifications