రాజకీయ మైలేజ్ పొందాలనే - వైషమ్యాలు పెంచేందుకు : పట్టాభి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు..!!
ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధికి కోర్టు రోజుల రిమాండ్ విధించింది. గవర్నర్‌పేట పోలీసులు విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. పట్టాభి తరపు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. ఇదే సమయంలో పట్టాభి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలసులు ప్రస్తావించారు.

నేరపూరిత చర్యలు కొనసాగించే అవకాశం
అరెస్టుకు గల కారణాలను వెల్లడించారు. పట్టాభి రాజకీయ మైలేజీని పొందాలనే ఉద్దేశ్యంతో నేరపూరిత చర్యలను కొనసాగించవచ్చని... పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే ఆయన మరింత బెదిరింపులు దిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతుందని తెలిపారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే రాజకీయ బలంతో ఫిర్యాదుదారుడిని ఇతర సాక్షులను బెదిరించి ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు.

నాలుగు కేసుల్లో పట్టాభి నిందితుడు
ఇప్పటికే నాలుగు కేసుల్లో పట్టాభి నిందితుడుగా పేర్కొన్నారు. పట్టాభి ప్రకటన కారణంగా చాలా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. ఒక పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసే స్థాయికి వెళ్లిందని రిమాండ్ రిపోర్టులో పొందు పర్చారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పట్టాభిని అరెస్టు చేయడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసారు. కులాలు.. మతాల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. శాంతి ఉల్లంఘనను ప్రేరేపించడానికి పట్టాభి సమగ్రమైన.. భయపెట్టే భాషను మరింతగా ఉపయోగించే అవకాశం ఉందని వివరించారు.

చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నం
ఇప్పటివరకు సేకరించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో పట్టాభి పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోందని రిపోర్టులో స్పష్టం చేసారు. పట్టాభి కుట్రను మరింత పరిశోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టాభిని అరెస్టు చేయకపోతే, కొన్ని రాజకీయ పార్టీల నుంచి అతని మాటలకు మద్దతు లభించిన దృష్ట్యా నిరసనల సమయంలో మరోసారి అతని వ్యాఖ్యలు పునరావృతమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నేర స్వభావం కలిగిన వ్యక్తి
పట్టాభి నేర స్వభావం కలిగిన వ్యక్తి...అరెస్టు చేయడం తప్ప వేరే మార్గం లేదుని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, పట్టాభి బెయిల్ పిటీషన్ ... అదే సమయంలో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ పైన ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలు..ఆ తరువాత జరిగిన పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

టీడీపీ..వైసీపీ పోటా పోటీ దీక్షలు.
టీడీపీ..వైసీపీ పోటా పోటీ దీక్షలు..నిరసనలతో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ఈ రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఇక, దీని పైన కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. ఆయన రాష్ట్రపతితో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరారు.