జగన్ మంత్రులకు మావోయిస్టుల ముప్పు? మరో మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం-అదే జిల్లాలో
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దగా మావోయిస్టు దాడులు జరగకపోయినా ఏజెన్సీల్లో కదలికలు పెరుగుతున్నాయి. తాజాగా ఏవోబీనూ భారీ కూంబింగ్ సాగుతోంది. మరోవైపు విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో మావోయిస్టులు విరుచుకుపడవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగే మంత్రులకు వరుసగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తోంది. దీంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.

జగన్ మంత్రులకు మావోల ముప్పు?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి తాజాగా రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అభివృద్ధి కంటే సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. దీంతో ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అభివృద్ధి అజెండాను తెరపైకి తెస్తోంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో శ్రమిస్తున్న కేబినెట్ మంత్రులకు మావోయిస్టుల ముప్పు పెరుగుతున్నట్లు నిఘా నివేదికలు చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

కేబినెట్ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు
ఏపీలో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ తెలంగాణ సరిహద్దుల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మంత్రుల రాకపోకలు పెరుగుతున్నాయి. అదే సమయంలో మావోయిస్టుల కదలికలు కూడా పెరుగుతున్నాయి. దీంతో మంత్రులకు ఎలాంటి ముప్పు కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓ మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో మంత్రికి కూడా అదే రకం వాహనాన్ని కేటాయించింది.

మంత్రి వేణుగోపాలకృష్ణకు బుల్లెట్ ప్రూఫ్
గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వ్యవసాయ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన ప్రభుత్వం.. ఆయన పక్క నియోజకవర్గం రామచంద్రాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్నమరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సైతం బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కేటాయించింది. నిఘా వర్గాల నివేదికల నేపథ్యంలో వీరిద్దరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చినట్లు తెలుస్తోంది, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఈ ఇద్దరు మంత్రులకు మావోయిస్టుల ముప్పు లేకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే తిరగాలని చెప్పినట్లు తెలుస్తోంది.

అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ
రాష్ట్రంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర కీలక నేతల భద్రతను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. నిఘా వర్గాల నివేదికలతో పాటు ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని నేతలకు వాహనాలు, సెక్యూరిటీ కేటాయిస్తుంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం పలువురు టీడీపీ నేతలకు భద్రత పెంచింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి భద్రత తొలగించింది.. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు, మంత్రులకు భద్రత పెంచాల్సిన పరిస్దితి వచ్చింది.












Click it and Unblock the Notifications