జూన్ నాటికి ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్: నారాయణ, సింగపూర్ సిద్ధం: కేఈ
గుంటూరు: జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ ఆదివారం తెలిపారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉంటుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తారని చెప్పారు.
చండీగఢ్ తరహాలో రాజధాని: కేఈ కృష్ణమూర్తి
ఛండీగడ్‌లా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఉంటుందని, ఇందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఫ్రెంచ్ దేశం సాంకేతిక పరిజ్ఞానంతో ఛండీగడ్ రాజధాని నిర్మాణం జరిగిందన్నారు. అదే తరహాలో సింగపూర్ దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తుళ్లూరులో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధమౌతున్నాయని చెప్పారు. భూ సమీకరణ కోసం 30 ప్రత్యేక బృందాలు డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షతన వేగంగా పనులు చేస్తున్నారన్నారు.
రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జీవో 398ని శనివారం రద్దు చేశామని తెలిపారు. పాత విధానంలోనే భూములు స్థలాల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే లే ఔట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అధికారుల పంపిణీపై త్వరలో ఏపీ జీవో
రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది ఐఎఎస్ అధికారులు, 28 మంది ఐపిఎస్ అధికారులు, 31 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తూ తయారైన దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదలవుతుంది.












Click it and Unblock the Notifications