Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..!
అమరావతి (amaravati)ని ఏపీకి శాశ్వత రాజధానిగా మార్చేందుకు వీలుగా తాజాగా పార్లమెంట్ లో రాష్ట్ర పునర్ విభజన చట్టానికి సవరణలు చేశారు. అదే సమయంలో అమరావతి శాశ్వత రాజధాని కాబోదని, దాని స్ధానంలో మావిగాన్ పేరుతో మరో కొత్త రాజధాని ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిపై టీడీపీ నేతలు ట్రోలింగ్ చేస్తున్న తరుణంలో ఇవాళ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) మావిగాన్ ను సమర్థిస్తూ, అమరావతి కంటే ఇది ఎలా బెటరో వెల్లడించారు.
రెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ (mavigun) అనే పదం మీద చర్చ జరుగుతోందని అంబటి రాంబాబు తెలిపారు. డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంటున్న చంద్రబాబుకు.. ఉడా, తుడా, గుడా పదాలు మాత్రం కనిపిస్తున్నాయా ? అని అంబటి ప్రశ్నించారు. జగన్ మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారని, చంద్రబాబు రాజధానిపై చేస్తున్న మభ్యపెట్టే కార్యక్రమానికి విరుగుడుగానే దీన్ని ప్రతిపాదిస్తున్నట్లు అంబటి తెలిపారు. 2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయా.న్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారని, గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారని గుర్తుచేశారు.

అందుకే జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారని, ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైందని చెప్పుకొచ్చారు. అందుకే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై తండ్రీ కొడుకులకు భయం పట్టుకుందన్నారు. ఇందులో భాగమే టీడీపీ నేతల ట్రోలింగ్ అన్నారు. దీనికి వైసీపీ భయపడబోదన్నారు.

మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణమని, అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని అంబటి తెలిపారు. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చన్నారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయని, కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే అన్నారు. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నదని, డైనమిక్ పవర్ హౌస్ లాంటిదని తెలిపారు. అమరావతి ఓ చిన్న ప్రాంతమే అన్నారు. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్ అన్నారు. అందుకే చంద్రబాబు అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టే బదులు మావిగాన్ ను అమలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications