మెగా కుటుంబానికి ఈసారి సీఎం పదవి ? యాక్టర్ శివాజీ జోస్యం- కండిషన్ ఇదే !
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్, నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఖాయంగా జరగబోతున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు ? సీఎం పదవి దక్కించుకునేదెవరన్న దానిపై రాష్ట్రంలో పలు విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ-జనసేన కూటమి తరఫున సీఎం పదవి దక్కించుకునేదెవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో టాలీవుడ్ హీరో, బిగ్ బాస్ ఫేం శివాజీ స్పందించారు.
Recommended Video

రాష్ట్రంలో సీఎం పదవి దక్కించుకునే అవకాశం మెగా ఫ్యామిలీకి కచ్చితంగా ఉందని హీరో శివాజీ ఇవాళ ఓ సినిమా ఫంక్షన్ లో జోస్యం చెప్పారు. మెగాస్టార్ కుటుంబానికి సీఎం పదవి దక్కడం పెద్ద విషయం కాదని, ఆయనకు అభిమానులు రాష్ట్రమంతా ఉన్నారన్నారు. నిజానికి మెగా కుటుంబానికి సీఎం పదవి దక్కడం పెద్ద కష్టం కూడా కాదన్నారు. అయితే ఎక్కడో లోపం జరుగుతోందని శివాజీ పేర్కొన్నారు.

ఈసారి లోపాలు సరిదిద్దుకుని ముందుకు సాగితే మెగా ఫ్యామిలీ సీఎం పదవి దక్కించుకోవడం ఖాయమని శివాజీ విశ్లేషించారు. మెగా ఫ్యామిలీలో ఒకరు సీఎం అయ్యే ఛాన్స్ అలాగే సజీవంగా ఉందని శివాజీ తెలిపారు. మరోవైపు తన గురించి మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో లేనన్నారు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉన్నానన్నారు. గతంలో బీజేపీలో ఉన్నా .. ఆ పార్టీ విభజన హామీలు అమలు చేయకపోవడంతో బయటకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో సీఎం పదవిపై చర్చ వచ్చినప్పుడు అనుభజ్ఞుడైన చంద్రబాబే సీఎం పదవి చేపడతారంటూ ఆయన తనయుడు లోకేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనిపై జనసేనలో అసంతృప్తి ఉందని తెలిసి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్లారిటీ ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఆ అవకాశం ఉందనే అర్ధం వచ్చేలా శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.












Click it and Unblock the Notifications