వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి: మంత్రి పేర్ని నానికీ
అమరావతి: ఏపీ ప్రభుత్వం-తెలుగు చలన చిత్ర పరిశ్రమ మధ్య కొన్ని నెలల పాటు కొనసాగిన వివాదానికి తెర పడింది. టాలీవుడ్ పెద్దలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని తీసుకుంది. వాటి రేట్లను పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. అటు సామాన్య ప్రేక్షకులపై భారం పడకుండా- ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ, నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా మధ్యేమార్గంగా సినిమా టికెట్ల రేట్లను నిర్ధారించింది.
కొద్దిరోజుల కిందటే మెగాస్టార్ చిరంజీవి, ఆర్ నారాయణమూర్తి, మహేష్‌బాబు, ప్రభాస్, పోసాని కృష్ణమురళి, అలీ, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చిరంజీవి టీమ్‌తో నిర్వహించిన చర్చలకు అనుగుణంగా- ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను నిర్ధారించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ధరలను ఫిక్స్ చేశారు.

నగర/గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లల్లో వేర్వేరుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20 రూపాయలు, గరిష్ఠంగా 250 రూపాయలుగా ఖరారు చేసింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల వారీగా ధరలు ఫిక్స్ చేసింది. ప్రీమియం, నాన్ ప్రీమియంగా రేట్లను ఖరారు చేసింది.
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022
టికెట్ల రేట్లను సవరిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా టికెట్ల రేట్లను ప్రభుత్వం ఖరారు చేసిందని అన్నారు. అటు థియేటర్ల మనుగడ, ఇటు ప్రజలకు వినోదాన్ని అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని వైఎస్ జగన్ దృష్టిలో పెట్టుకున్నారని అన్నారు. దీనికి అనుగుణంగా సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ కొత్త జీవోను జారీ చేశారని చెప్పారు.
కొత్త జీవోను విడుదల చేయడం పట్ల తాను తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరఫున వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని చిరంజీవి అన్నారు. అలాగే- చిన్న సినిమాలను ప్రోత్సహించేలా- అయిదవ ప్రదర్శనకు అవకాశం కల్పించడాన్ని కూడా స్వాగతిస్తున్నానని చెప్పారు. అయిదవ షోకు అనుమతి కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడుతుందని అన్నారు. టికెట్ల రేట్ల వివాదాన్ని పరిష్కరించడంలో అహర్నిశలు శ్రమించి, చిత్ర పరిశ్రమ తరఫున నిలిచిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులు, కమిటీకి ధన్యవాదాలను తెలపుతున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications