మేకపాటి చంద్రశేఖరరెడ్డిని "ఫిక్స్" చేసిన వైసీపీ..!!
మేకపాటి చంద్రశేఖరరరెడ్డి అడుగులు ఎటువైపు. క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో వైసీపీ మేకపాటిని సస్పెండ్ చేసింది. వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామనే హామీ లేని కారణంగానే ఆయన క్రాస్ ఓటింగ్ చేసారనేది పార్టీ నేతల వాదన. ఇదే సమయంలో మేకపాటి కూడా పార్టీ నేతలతో సై అంటే సై అంటున్నారు. సవాళ్లు చేస్తున్నారు. తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీతో పాటు గా మేకపాటి కుటుంబం కూడా చంద్రశేఖరరెడ్డి తీరును తప్పు బడుతోంది. అటు టీడీపీలోకి నేరుగా వెళ్లలేక..ఇటు వైసీపీలో మద్దతు లేక, కుటుంబ వ్యతిరేకత నడుమ చంద్రశేఖరరెడ్డి ఒత్తిడిలో ఉన్నారు.
ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి అప్పుడు అనూహ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో ఆయనను వైసీపీ సస్పెండ్ చేసింది. తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని చెబుతూ వచ్చారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ప్రతికూలా ఫలితాలు తప్పవని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి అనిల్ కు సీటు ఇవ్వరని.. ఒక వేళ ఇచ్చినా ఓడిపోతారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జిల్లా వైసీపీ నేతల సవాళ్లతో ఉదయగిరి సెంటర్ లో మేకపాటి కుర్చీ వేసుకొని కూర్చొన్నారు. వైసీపీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని..ఎవరికి సీటు ఇచ్చినా గెలవరంటూ చెప్పుకొచ్చారు.

తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి గురించి చంద్రశేఖరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తన అన్నను రాజకీయాల్లోకి తెచ్చింది తానే అనీ, ఇప్పుడు ఆయన పదవీ వ్యామోహంతో ఉన్నారని చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. తన అనారోగ్యానికి కారణం కూడా తన కుటుంబ సభ్యులేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గంతో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లోనూ తన వ్యతిరేకులకు తన అన్న మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఆరోగ్యం సహకరించకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. ఇటు చంద్రశేఖరరెడ్డి తీరు పైన రాజమోహన్ రెడ్డి కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. పార్టీ..మేకపాటి అనే ఇంటి పేరు పక్కన పెడితే చంద్రశేఖర రెడ్డి ఏంటో ఆలోచించుకోవాలని సీరియస్ కామెంట్స్ చేసారు.
ఇక, ఉదయగిగిరిలో కొత్త ఇంఛార్జ్ నియామకం పైన వైసీపీ నాయకత్వం ఫోకస్ చేసింది. ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 3వ తేదీన పార్టీ నాయకత్వం ప్రకటన చేస్తుందని సమాచారం. ఇటు వైసీపీ స్థానిక నేతలు చంద్రశేఖరరెడ్డికి దూరమయ్యారు. మేకపాటి కుటుంబం తాము జగన్ తోనే కలిసి సాగుతామని స్పష్టం చేసింది. ఇటు టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మద్దతు లేదు. దీంతో, ఇప్పుడు చంద్రశేఖరరెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారు..ఉదయగిరి కేంద్రంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications