మరో అల్పపీడనం, మళ్లీ భారీ వర్షాలు- లేటెస్ట్ రిపోర్ట్..!!
రాష్ట్రంలో దంచికొట్టిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వాగులు, నదులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలతో కొంత మేర రిలీఫ్ దక్కింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలతో కాలువలు పొంగి ప్రవహించాయి. వాగులు, నదులు ప్రమాద కరంగా పొంగి పొర్లుతున్నాయి. దీంతో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇదే టైం లో ఐరోపా వాతావరణ సంస్థ ఈ నెలాఖరున మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని తాజా అంచనాగా వెల్లడించింది.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టాయి. ఉత్తరాంధ్ర జిల్లా ల పైన ఎక్కువ ప్రభావం పడింది. నదులు ప్రమాద కరంగా పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి ఈ సీజన్‌లోనే తొలిసారి అత్యధిక వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ 70 గేట్లలో 65 గేట్లను అడుగు మేర ఎత్తి 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సిక్కోలు జిల్లాలో నాగావళి ఉగ్రరూపం దాల్చింది. పాలకొండ మండలంలో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అన్నవరం చుట్టూ నీటిని తీసేయడం కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాలు.. వరదల వేళ ప్రభుత్వ సహాయక చర్యల పైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. అన్ని రకాలుగా అండగా నిలవాలని సూచించారు.

28న అల్ప పీడనం ఏర్పడే అవకాశం..!
కాగా, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల నుంచి తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్యంగా పయనించి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. అదే విధంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో ఈనెల 28 తరువాత ఉపరితల ఆవర్తనం ఆవరిస్తోందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐరోపా వాతావరణ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత వాయుగుండం పూర్తిగా బలహీనపడ్డాక ఉత్తర, మధ్యభారతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని వెల్లడించారు. వచ్చే నెల రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్‌కు అవకాశం ఉందని బంగ్లాదేశ్‌కు చెందిన సైక్లోన్‌మన్ అంచనా వేశారు. అయితే, ఈ అంచనాలతో ఉత్తరాంధ్ర జిల్లాల పైనే ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.













Click it and Unblock the Notifications
