మూడు రాజధానులకు 2024 ఎన్నికలే రిఫరెండం - అప్పుడే ముగింపు : మంత్రి సంచలనం..!!
ఏపీలో ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల వ్యవహారం పైన మంత్రి అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందంటూ వైసీపీ నేతలు చెబుతున్న సమయంలో మంత్రి గుడివాడ అమర్నాధ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసాయి. మూడు రాజధానుల అంశాన్ని ప్రజాభిప్రాయం (రెఫరెండం)గా తీసుకొని 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు. అప్పటితో రాజధాని అమరావతికి ముగింపు కార్డు పడుతుందని చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికలతోనే పరిష్కారమా
ప్రస్తుతం అమరాతి జేఏసీ అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలు దీనిని తప్పు బడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన అధికార పార్టీ నేతలు ఇది పాదయాత్ర కాదని.. ఉత్తరాంధ్ర పై దండయాత్రగా అభివర్ణిస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల పైన ప్రభుత్వం బిల్లులు తీసుకొస్తుందని చెబుతున్నా.. న్యాయ పరమైన చిక్కుల కారణంగా సాధ్యపడదనేది మరో వాదన. దీంతో.. ప్రభుత్వం మూడు రాజధానుల అంశంలో తమ వైఖరి స్పష్టం చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ సమయంలోనే మంత్రి అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

అసెంబ్లీలో బిల్లు ఖాయమంటూ
ఏళ్ల తరబడి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ఓ దండు మన ప్రాంతానికి బయలుదేరిందని, వారిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అవుతుందని తేల్చి చెప్పారు. రేపు ప్రారంభం అయ్యే సమావేశాలు. లేకుంటే మరోసారి సమావేశంలో అయినా మూడు రాజధానుల బిల్లు వస్తుందని స్పష్టం చేసారు. మూడు రాజధానులను అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదన్నారు. తుల యాత్ర దేవుడిని చూడడానికి అయితే ఫర్వాలేదని, తమ ప్రాంతానికి వచ్చి ఇది అభివృద్ధి చెందకూడదని మొక్కుతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన సీతంరాజు సుధాకర్‌ను గెలిపించి మూడు రాజధానులకు మద్దతు పలకాలని మంత్రి పిలుపుని చ్చారు.

శాంతియుత నిరసనలకు పిలుపు
అదే విధంగా రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల పైన ఆయన స్పందించారు. ప్రభుత్వం అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుటుందని చెప్పుకొచ్చారు విశాఖలో పరిపాలనా భవనాలు నిర్మించకూడదా అంటూ ప్రశ్నించారు. అదే విధంగా పార్టీ ముఖ్య నేత..టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి త్వరలోనే న్యాయ పరమైన ఇబ్బందులను పరిష్కరించుకొని విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయటానికి వస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియ చేయాలని సుబ్బారెడ్డి సూచించారు. దీంతో..అటు రైతుల పాదయాత్ర..ఇటు అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications