అమరావతి పాదయాత్రను అడ్డుకోండి: మంత్రి బొత్స పిలుపు
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకోవాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలొచ్చినా తాము వికేంద్రీకరణకే కట్టుబడివున్నామని, ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు తెలపాలని కోరారు. దుష్టశక్తులను, దుర్మార్గులను ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలని, నిరోధించాలన్నారు. అడుగు ముందుకు వేయకుండా, ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలు చేపట్టకుండా అందరూ మందుకు రావాలని కోరారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారే బాగుపడాలా?
అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా కాకినాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలంతా నాశనమై రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసుకునేవారే బాగుపడాలా? అంటూ ప్రశ్నించారు. వ్యాపారులు, దొంగలు, దోపిడీదారులు అందరూ కలిసి పాదయాత్రగా వస్తున్నారని, రాష్ట్ర ప్రజల కష్టాన్ని 29 గ్రామాల గోతుల్లో పోయాలంటున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ప్రజాభిమానం కోల్పోయిందని, ఆ పార్టీ ముసుగులో అమరాతికి మద్దతుగా పాదయాత్ర జరుగుతోందన్నారు.

మా దగ్గరకొచ్చి మాకే శాపనార్ధాలా?
తమ దేవుడి దగ్గరకే వచ్చి తమపై శాపనార్ధాలు పెడతారా? అన్నారు. 29 గ్రామాల కోసమో, ఏ ఒక్క ప్రాంతానికో, వర్గానికో, కులానికో అని ఆలోచించకుండా అందరి క్షేమం కోరే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్నవరం టు తిరుపతి అనే పేరుతో 50వేల మందితో పాదయాత్ర చేస్తామని, కాకినాడ జిల్లాకే రాష్ట్ర సంపద అంతా తెచ్చిపెడతారా? అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు.

చంద్రబాబుది స్వార్థం
అభివృద్ధి అంటే తాను చేసిందే అభివృద్ధి అనే ఆలోచనలోచంద్రబాబు ఉన్నారని, పాలనంతా ఒకే చోట ఉండాలనే స్వార్థపూరిత నిర్ణయమని మరోమంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఆచార్య చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications