చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. ఆయన పాపం పండింది: మంత్రి గుడివాడ అమర్నాథ్!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబు పాపం పండిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ పై ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ప్రజలు అంతా గమనిస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ ని, అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని పేర్కొన్నారు.
ప్రజాధనాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించుకున్న ఘనుడు చంద్రబాబు అని పేర్కొన్న ఆయన, ఆయన హయాంలో అన్ని స్కామ్ లే జరిగాయని విమర్శించారు. షెల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చంద్రబాబు డ్రామా చేశారని విమర్శించారు. చంద్రబాబు చెప్పిన ఏ కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని, బాబు హయాంలో జరిగింది అంతా అవినీతి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను చేసిన దోపిడీకి చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. నైపుణ్య అభివృద్ధి పేరుతో యువతను నిలువునా మోసం చేశారని, యువత భవిష్యత్తుతో చంద్రబాబు ఆటలాడారన్నారు. చేసిన తప్పులకు చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆయన మండిపడ్డారు. ఐటీ నోటీసుల కేసులో ఇద్దరు నిందితులను దుబాయ్, అమెరికాకు చంద్రబాబు పంపించారని, వారు చంద్రమండలంపై ఉన్నప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థలు ఎక్కడున్నా వారిని అరెస్ట్ చేస్తారని ఆయన తెలిపారు. తప్పులు చేసినప్పుడు అరెస్టు చేయకపోతే మరేం చేస్తారంటూ ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్, చంద్రబాబు సానుభూతి రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేశాడని, అయితే ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
అంతేకాదు చంద్రబాబు అరెస్టును ఖండించిన పురందేశ్వరి పైన కూడా తనదైన శైలిలో మండిపడ్డారు. పురందేశ్వరికి చట్టం కంటే చంద్రబాబునే ముఖ్యమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని, ఎంత క్రిమినల్ స్కిల్ లేకుంటే ఇలాంటి ఐడియా వస్తుందన్నారు. చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications