ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో, అది కనిపిస్తుంది- పవన్ కు మంత్రి అమర్నాధ్ కౌంటర్..!!
విశాఖ కేంద్రంగా పవన్ వర్సస్ వైసీపీ రాజకీయం కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్నారు. రుషికొండను సందర్శించారు. ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు. సీఎం జగన్..మంత్రులు..స్థానిక ఎంపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రుషికొండ నిర్మాణాల పైన మంత్రి రోజా స్పష్టత ఇచ్చారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి అమర్నాధ్ సమాధానం చెప్పారు. అదే సమయంలో సవాల్ చేసారు.
ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే విశాఖలో భూ దందాలు జరిగాయన్నారు. గీతం కాలేజీ ఆక్రమణలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి మండిపడ్డారు. ఎలాంటి అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని, టీడీపీ అక్రమాలపై గతంలో పవన్ ఎందుకు నిలదీయలేదంటూ అమర్‌నాథ్ దుయ్యబట్టారు. రుషికొండ వద్ద ఎదో హడావుడి చేసి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్యాకేజీకి అమ్ముడు పోయావ్.. 2 లక్షల పుస్తకాలలో జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివి ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు. అనుమతి లేకుండా డ్రోన్లతో రుషికొండ వద్ద చిత్రీకరించినందుకు మరోసారి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

రుషి కొండ వద్ద పవన్ కళ్యాణ్ అన్నయ్య చెప్పినట్టు ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేదన్నారు. చంద్ర బాబు బంధువు కాబట్టే గీతం కాలేజీ అక్రమ నిర్మాణం, కబ్జా పవన్ కళ్యాణ్‌కు కనిపించ లేదా అని మంత్రి అమర్నాధ్ నిలదీసారు జగదాంబ జంక్షన్‌లో వాలంటీర్‌లు అన్నదమ్ములు అన్నారని.. మళ్లీ నిన్న దండుపళ్యం బ్యాచ్ అంటున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై పవన్ అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. తమ పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని పవన్ చెప్పటంపైన మంత్రి స్పందించారు. కేంద్రానికి కాకుంటే అత్తగారింటికి రష్యాకు వెళ్లి పుతిన్ కు చెప్పుకోవచ్చని మంత్రి అమర్నాధ్ ఎద్దేవా చేసారు. గాజువాకలో ఓడించారనే కోపంతోనే పవన్ ఇలా వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications