సెల్ఫీ పిచ్చితో చంద్రబాబు పిల్లచేష్టలు, చిల్లర రాజకీయాలు: మంత్రి జోగి రమేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఏలూరు జిల్లా పోనంగి గ్రామంలో వైఎస్సార్ సిపి ప్రభుత్వం పేదల కోసం కట్టిస్తున్న ఇళ్లను పరిశీలించిన జోగి రమేష్ అనంతరం మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు నాయుడు సెల్ఫీల పిచ్చితో పిల్ల చేష్టలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. జగనన్న లేఅవుట్ మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకుంటున్న పరిస్థితులు చూస్తున్నామని, చంద్రబాబు లాంటివాళ్లు ఎంతమంది అడ్డొచ్చినా ఈ కార్యక్రమాన్ని ఆపలేరన్నారు. చంద్రబాబు నెల్లూరులో సెల్ఫీ వీడియో తీసి నేనే కట్టాను అని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే దానికి దీటుగా జగన్ పరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి చేశారో చూడాలని తాము కూడా రీట్వీట్ చేశామన్నారు.

దానికి ఇప్పటివరకు చంద్రబాబు సమాధానం చెప్పలేదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు లాంటి వాళ్లు ఎంతమంది అడ్డొచ్చినా ఆపలేరని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తూ సీఎం జగన్ అడుగు ముందుకు వేస్తూ ఉంటే, చంద్రబాబు ఇళ్ల నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.
ఇక సెల్ఫీలు తీసుకుంటూ ట్వీట్లు చేస్తున్న చంద్రబాబు, నారా లోకేష్ లు తమ ఛాలెంజ్ ను స్వీకరిస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్ హయాంలో నిర్మించిన రాష్ట్రంలోని కోటి అరవై లక్షల ఇళ్ల వద్దకు రాగలరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రమంతా కాకపోయినా కుప్పంలోకి వచ్చినా తాము చేసిన అభివృద్ధి ఏమిటో, సంక్షేమం ఏమిటో చూపిస్తామని జోగి రమేష్ సవాల్ విసిరారు.
ఇక ఇదే సమయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ని టార్గెట్ చేసిన జోగి రమేష్ హరీష్ రావు కూడా ఏపీకి వస్తే ఏపీ లో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటూ విజిటింగ్ వీసా మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications