శవరాజకీయాలకు టీడీపీదే పేటెంట్; వాళ్లకు నాలుగు శవాలు కనిపిస్తే చాలు: మంత్రి కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డిగూడెం మరణాలపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏపీ శాసనసభ సమావేశాలలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలని టిడిపి నేతలు అధికార పక్షంపై ఒత్తిడి తీసుకు వస్తుంటే టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు జంగారెడ్డిగూడెం మరణాలు ప్రభుత్వ హత్యలే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

టీడీపీ నేతలకు నాలుగు శవాలు కనిపిస్తే చాలు
తాజాగా మంత్రి కన్నబాబు శాసనసభలో, శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై రచ్చ చేస్తున్న టిడిపి నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలపై ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాన్ని టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టిడిపి సభ్యులు జరగని విషయాన్ని జరిగినట్లు చెబుతున్నారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నేతలు నాలుగు శవాలు కనిపిస్తేచాలు అక్కడికి వెళ్లి శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కన్న బాబు నిప్పులు చెరిగారు.

టీడీపీ నేతలు ఎక్కడ శవాలు ఉంటాయా అని వెతుక్కుంటారు
టిడిపి నేతలు ఎక్కడ శవాలు ఉంటాయా అని వెతుక్కుంటూ ఉంటారని ఆయన విమర్శించారు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు స్నానం చెయ్యాలనే సరదా కోసం 29 మంది ప్రాణాలు తీశారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఆ ఘటనలో మృతి చెందిన ఇరవై తొమ్మిది మంది కుటుంబాలను కనీసం చంద్రబాబు పరామర్శించారా? లేదంటూ కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. గతంలో చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా చేతిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు అని, కనీసం వాళ్ళ కుటుంబాలకు కూడా చంద్రబాబు సానుభూతి ప్రకటించలేదని మంత్రి కన్నబాబు ఆరోపించారు.

శవ రాజకీయాలకు టీడీపీకే పేటెంట్
కానీ తాజాగా జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు రాజకీయ యాత్ర చేశారంటూ మండిపడ్డారు. కేవలం రాజకీయాల కోసం జంగారెడ్డిగూడెం మరణాలను చంద్రబాబు వాడుకుంటున్నారని మంత్రి కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. శవ రాజకీయాలకు టిడిపి పేటెంట్ గా మారిందని కన్నబాబు మండిపడ్డారు. శవాలను పట్టుకుని రాజకీయాలు చెయ్యటం ఆ పార్టీకి అలవాటు అయిందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీని దుర్మార్గంగా కించపరచాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Recommended Video

సిగ్గూ శరం లేకుండా జంగారెడ్డి గూడెం మరణాలపై రాజకీయం
ఇంటింటికి బెల్టుషాపులు, పర్మిట్ రూమ్ లు పెట్టి దారుణంగా మద్యం అమ్మకాలు సాగించిన ఘనత చంద్రబాబుదేనని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నాడు. ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేస్తే, చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం కంపెనీలతో కుమ్మక్కయి మద్య నిషేధానికి తూట్లు పొడిచారని కన్నబాబు విమర్శించారు. మద్యం అమ్మకాలు పెంచిన చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు. ఇప్పుడు సిగ్గూ శరం లేకుండా జంగారెడ్డి గూడెం మరణాలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications