మంగళగిరిపై లోకేష్ స్పెషల్ ఫోకస్.. రూ.18 కోట్లతో మోడల్ రైతుబజార్!
మంగళగిరి నియోజక వర్గ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వేల కోట్ల నిధులతో మంగళగిరి రూపురేఖలు మారుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి లోకేష్ మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు, రైతుల సౌకర్యార్థం ఆధునిక మోడల్ రైతుబజార్ ఏర్పాటుకు మంత్రి నారా లోకేశ్ నేడు శంకుస్థాపన చేశారు.
రూ.18 కోట్ల వ్యయంతో మోడల్ రైతు బజార్
నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.18 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మొత్తం 5.90 ఎకరాల విస్తీర్ణంలో 71,925 చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న ఈ మార్కెట్‌లో రిటైల్, హోల్‌సేల్ విభాగాలు ఉంటాయి. రిటైల్ విభాగంలో కూరగాయల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 స్టాళ్లు, ఇతర వస్తువులకు 60 షాపులు ఏర్పాటు చేయనున్నారు.

రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం
హోల్‌సేల్ మార్కెట్‌లో 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులు ఉంటాయి. అదనంగా కోల్డ్ స్టోరేజీ, కూరగాయలు కడిగే ప్రాంతం, క్యాంటీన్, శుభ్రమైన మరుగుదొడ్లు, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సరకుల రవాణా వాహనాలతో పాటు టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ మోడల్ రైతుబజార్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా విక్రయించుకునే అవకాశం ఏర్పడనుంది.
రైతుల సంక్షేమం, వినియోగదారుల సౌకర్యం లక్ష్యంగా మోడల్ రైతు బజార్
మంగళగిరి ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు సులభ ధరలకు అందుతాయి. మంగళగిరి ప్రాంతంలోని రైతులు, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ మార్కెట్‌ను తీర్చిదిద్దనున్నారు. మంత్రి లోకేశ్ ఈ శంకుస్థాపన సందర్భంగా రైతుల సంక్షేమం, వినియోగదారుల సౌకర్యం దృష్టిలో పెట్టుకుని ఆధునిక సదుపాయాలతో కూడిన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మంగళగిరిపై మంత్రి లోకేష్ ఫోకస్
ఈ ప్రాజెక్టు పూర్తయితే మంగళగిరి ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే ఈ మోడల్ మార్కెట్ ఇతర ప్రాంతాలకు కూడా ఉదాహరణగా నిలవనుంది. మొత్తంగా లోకేష్ తనకు అవకాశం ఇచ్చిన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు.












Click it and Unblock the Notifications