నేడు విశాఖలో టాప్ ఐటీ కంపెనీలకు మంత్రి లోకేష్ శంఖుస్థాపన.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సును నిర్వహించనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు కోసం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ సమయంలోనే సదస్సు ప్రారంభానికి ముందే నేడు ( నవంబర్ 13, 2025 ) విశాఖ వేదికగా పలు దిగ్గజ ఐటీ కంపెనీలు సహా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంఖుస్థాపన జరగనుంది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ & రహేజా ఐటీ స్పేస్..
నగరంలోని ఎండాడలో పనోరమ హిల్స్ వెనుక పది ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. మంత్రి లోకేశ్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. పెద్ద స్టార్ హోటల్, ఆఫీసు స్పేస్‌తో పాటు కోవర్కింగ్ స్పేస్ ఇందులో రానున్నాయి. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రహేజా ఐటీ స్పేస్ & రెసిడెన్షియల్ ప్రాజెక్టును మధురవాడ ఐటీ హిల్ నెం.3లో నిర్మించనుంది. తొలి దశలో రూ.2,172 కోట్ల పెట్టుబడితో.. 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

ఫెనోమ్ ఐటీ క్యాంపస్ & తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ..
అలానే రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి కూడా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీకి ఐటీ హిల్ నంబరు 2లో 4 ఎకరాలు, మధురవాడలో మరో 0.45 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ రూ.207.5 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఐటీ హిల్ నెం.2లో టెక్ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ భూమి పూజ నిర్వహించనున్నారు. లో-కోడ్, ఏఐ టెక్నాలజీలపై ఈ సంస్థ దృష్టి సారించనుండగా.. రాబోయే ఐదేళ్లలో 2,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సెయిల్స్ సాఫ్ట్‌వేర్ & ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్..
ఐటీ హిల్ నెం.3లో సెయిల్స్ సాఫ్ట్‌వేర్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేస్తారు. ఈ అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభించనుంది. అంతేకాకుండా ఐటీ హిల్ నెం.2లో ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్ సంస్థ తన యూనిట్‌ను ప్రారంభించనుంది. హెల్త్‌కేర్ ఐటీ సేవలు, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌పై దృష్టి సారించనున్న ఈ సంస్థ, విశాఖలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.
ఇక ఇప్పటికే విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు తమ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. గూగుల్ సంస్థ కూడా అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ హబ్‌ను రూ.1.35 లక్షల కోట్లతో ఇక్కడ నెలకొల్పేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని ఆయన ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, రేపు తుపానులా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటలకు వేచి ఉండండి!!" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
A company that stopped new projects in 2019, is coming back to AP like a storm tomorrow. Who is it?? 😊😎Big unveil at 9 AM! Stay tuned!!#InvestInAP #ChooseSpeedChooseAP pic.twitter.com/bM9hrlfPjp
— Lokesh Nara (@naralokesh) November 12, 2025












Click it and Unblock the Notifications