డ్యూటీ ఎక్కిన నాదెండ్ల మనోహర్: ఆ కీలక శాఖ కేటాయింపు
Nadendla Manohar: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే జనసేన రాజకీయ వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డ్యూటీ ఎక్కేశారు. తన సొంత నియోజకవర్గం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. అన్ని ఏరియాల్లోనూ కలియతిరిగారు. ప్రజలతో మమేకం అయ్యారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీ అభ్యర్థిగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్నాబత్తుని శివకుమార్‌పై 48 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయనకు ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల మంత్రిత్వ శాఖను కేటాయించారు చంద్రబాబు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపటి కిందటే విడుదల అయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఈ శాఖను కొడాలి నాని, కారుమూరు వెంకట నాగేశ్వరరావు పర్యవేక్షించిన విషయం తెలిసిందే.
శాఖల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడక ముందే నాదెండ్ల మనోహర్.. తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వర్షాలు పడుతున్నందున అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్నీ వెంటనే తొలగించాలంటూ సూచించారు.
మురుగునీటి పారుదల, వరద కాలువలను పరిశీలించారు నాదెండ్ల మనోహర్. అందులో చెత్తను తక్షణమే తొలగించాలని అన్నారు. అవసరమైన చోట పూడికలు తీయించాలని అన్నారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త వల్ల మురుగునీరు, వరద ప్రవాహం రోడ్ల మీదికి వస్తోందంటూ ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు వివరించారు.












Click it and Unblock the Notifications