ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై నారా లోకేష్ సంచలన ప్రకటన- పాత పద్ధతిలోనే
Nara Lokesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. మరో హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికకు తుది రూపాన్ని దిద్దుతోంది.
అధికారంలోకి వచ్చిన అనంతరం సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచడం ద్వారా తొలి హామీని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని పునః ప్రారంభించింది. నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తోంది.

మరో హామీ- సంవత్సరానికి మూడు ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. దీపావళి పండగ రోజును పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో చంద్రబాబు స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
తాజాగా మరో పథకం అమలు చేయడంపై దృష్టి సారించింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయడంపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఓ ప్రకటన చేశారు. ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని వెల్లడించారు.
వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024- 2025 నుంచి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను అమలు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చాలామంది విద్యార్థులు తనను ట్యాగ్ చేస్తూ ఫీజు రీఎంబర్స్‌మెంట్, దానికి సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, వాటన్నింటినీ నోట్ చేసుకున్నానని నారా లోకేష్ అన్నారు.
పాత పద్ధతిలోనే ఈ మొత్తాన్ని విద్యార్థులు చదువుకుంటోన్న కళాశాలలు, విద్యాసంస్థల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా బదిలీ చేస్తామని తెలిపారు. పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కళాశాలకు బకాయి ఉన్న 3,500 కోట్ల రూపాయల మొత్తాన్ని దశలవారీగా విడుదల చేస్తామని నారా లోకేష్ అన్నారు.
సర్టిఫికెట్లు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను విద్యార్థులకు మంజూరు చేసే విషయంపై కళాశాలలతో కలిసి పని చేస్తామని, విద్యార్థుల సమస్యలను ముందుగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications