మున్సిపల్ ఎన్నికలు అప్పుడే - తేల్చి చెప్పిన మంత్రి...!!
ఏపీలో స్థానిక ఎన్నికలు కేంద్రంగా రాజకీయం కొనసాగుతోంది. ఈ నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కూటమి ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. కాగా.. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పైన జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లింది. ఇక.. ఇటు కూటమితో పాటుగా వైసీపీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రస్తుత పరిణామాల వేళ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చ ఉంది. ఈ సమయంలోనే మంత్రి నారాయణ ఎన్నికల నిర్వహణ పైన స్పష్టత ఇచ్చారు.
అమరావతిని ప్రపంచంలోని టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. గోదావరి పుష్కరాలతో పాటుగా స్థానిక ఎన్నికల పైన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ధి పనుల కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేశామని.. పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర నిధులతో గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 2028 చివరి నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

సుప్రీం నిర్ణయం తరువాతే ఎన్నికలు
కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్న నారాయణ, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. 'జల్ జీవన్ మిషన్' కింద కేంద్రం గతంలో రూ.5,350 కోట్లు మంజూరు చేసినప్పటికీ, 2019 ఫిబ్రవరిలో ఆ నిధులను వినియోగించలేదని మంత్రి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పైన ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను హైకోర్టు కొట్టి వేసింది. సుప్రీం నిబంధనలకు వ్యతిరేకంగా జీవోలు ఉన్నాయని పేర్కొంది. కాగా.. హై కోర్టు తీర్పు పైన ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లటంతో.. అక్కడ కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
