ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారా.. లేదా? క్లారిటీ ఇదే!
తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోటీపై సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఆయనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి సుముఖంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అయితే తాజాగా ఆయన ఎమ్మెల్సీ పోటీపై క్లారిటీ ఇచ్చారు.
తాను పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు. తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాల పదవీకాలం 2027 మార్చితో ముగియనుండటంతో ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల తమ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని బరిలో నిలపనున్నట్లు తెలిపింది.
అయితే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని, తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చెబుతున్నట్లు ప్రచారం జరిగింది. తాను ఎవరినీ టికెట్ అడగలేదని, తన పేరు అభ్యర్థిగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించిందని కూడా కొందరు చెప్పుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీ ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. తన అభ్యర్థిత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. తప్పుడు ప్రచారాలను పట్టభద్రులు, పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని కోరారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని పట్టభద్రుల ఆశీస్సులతో నిలబెట్టుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications
