అమరావతి నిర్మాణాల పై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్మాణాల ప్రక్రియను వేగ వంతం చేసింది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. రాజధాని పై సీఎం చంద్రబాబు ప్రతీ నెలా సమీక్ష చేస్తున్నారు. కీలక దిశా నిర్దేశం చేస్తూ.. పనుల పురోగతి పైన ఆరా తీస్తున్నారు. కాగా, మంత్రి నారాయణ ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలు..గడువు పైన కీలక అంశాలను వెల్లడించారు.
అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడికొండలో జరిగిన గ్రామ సభలో నారాయణ పాల్గొన్నారు. రైతుల సందేహాలను సమాధానం ఇచ్చారు. అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగు రోడ్డు, రాజధాని రేడియల్ రోడ్లకు భూ సమీకరణ చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నా యని చెప్పారు. నిర్మాణాలు పూర్తైన భవనాలను అతి త్వరలో వినియోగంలోకి తెస్తున్నామని .. దీనికి సంబంధించి కార్యాచరణ ఖరారు చేసినట్లు వివరించారు. రాజధాని ప్రణాళికలో భాగంగా రైల్వే లైన్, రింగు రోడ్డు కోసం భూములు అవసరమని చెప్పారు. రైతులు త్వరగా భూ సమీకరణకు వస్తే పనులు చేపడతామని చెప్పారు. తాడికొండ నుంచి రాజధాని వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నిర్దేశించిన సమయం ప్రకారం నిర్మాణాలు
కాగా.. తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు గ్రామాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ వెళ్తుందని మంత్రి వివరించారు. ల్యాండ్ అక్విజిషన్‌కు వెళ్లాలా లేక పూలింగ్‌కు వెళ్లాలా అనే దానిపై రైతుల అభిప్రాయాలు తీసుకున్న తరువాత నిర్ణయం ఉంటుందని వివరించారు. రైతులకు అనువైన చోటే రిటర్న్ ప్లాట్లు ఇస్తామని వెల్లడించారు. రెండు, మూడు లేఅవుట్ డిజైన్లు చూపించి రైతుల అభిప్రాయం మేరకు ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 2027 మార్చి నాటికి 350 కి.మీ ట్రంక్ రోడ్లు పూర్తవుతాయని, 2027 చివరి నాటికి అమరావతి లేఅవుట్లు పూర్తి చేస్తామని నారాయణ ప్రకటించారు. ఈ నెల(జులై) 25న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తామని, వచ్చే నెల 15న ఎమ్మెల్సీ క్వార్టర్స్, సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల నివాసాలను అప్పగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications