మహిళలకు ఉచిత బస్సు అమలు పై ప్రభుత్వం తాజా ప్రకటన..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామని చెప్పిన సూపర్ సిక్స్ అమలు పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే పెన్షన్ రూ 4వేల కు పెంపుతో పాటుగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. ఇక.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన కొంత కాలంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం అమలు పైన తాజా ప్రకటన చేసింది.
ప్రభుత్వం కసరత్తు
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలు దిశగా ఆర్టీసీ అధికారుల నుంచి నివేదిక కోరారు. తెలంగాణ, కర్ణాటకలో పర్యటించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు అక్కడ అమలు అవుతున్న ఈ పథకం గురించి పూర్తి సమాచారం సేకరించారు. ఈ పథకం అమలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పడే ఆర్దిక భారం.. లోటు భర్తీ, మహిళలకు అమలు చేయటం ద్వారా పురుష ల అభిప్రాయాలు.. అటో వాలా నుంచి వస్తున్న అభ్యంతరాల గురించి చర్చించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.

మంత్రి తాజా ప్రకటన
ఇక, ఇప్పుడు రాష్ట్రంలో ఈ పథకం అమలు పైన రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. త్వరలో మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్‌ను మంత్రి ప్రారంభించారు. కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. మంచి బస్సులను ప్రయాణికుల కోసం సిద్ధం చేశామన్నారు. కొద్ది రోజుల్లో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
సంక్రాంతికి ప్రారంభం
కొత్త సంవత్సరం ప్రారంభమైన తరువాత జనవరి నెలలోనే ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి వేళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకు రావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య.. పెంచాల్సిన అవసరం.. ఏ కేటగిరీ బస్సుల్లో ముందుగా అమలు చేయాలనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏసీ బస్సులు మినహా అన్ని కేటగిరీల్లోనూ అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా సమాచారం. దీంతో, సంక్రాంతికి ఈ పథకం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications