మహిళలకు ఉచిత బస్సు అమలు పై అనూహ్య నిర్ణయం..!!
ఏపీలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని టీడీపీ నేతలు సూపర్ సిక్స్ పథకాల పై హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు ప్రారంభించారు. ఇక, అమ్మఒడి .. అన్నదాత సుఖీభవ పథకాల పైన తాజాగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. మరో హామీగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వం కసరత్తు
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు పైన ప్రభుత్వం తొలుత అధికారుల నుంచి నివేదిక కోరింది. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో విధి విధానాలు.. ఆర్దిక భారం.. నష్టాల గురించి పూర్తి సమాచారంతో అధికారులు నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఆర్దిక సమస్యలు.. సిబ్బంది కొరత గురించి వివరించారు. కొత్త బస్సులతో పాటుగా సిబ్బంది నియామకం తోనూ ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుందని నివేదించారు. కాగా, నెలకు రూ 180 కోట్ల వరకు ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రీయంబర్స్ చేయాల్సి ఉంటుందని నివేదిక లో స్పష్టం చేసారు.

పథకాలు - ఆర్దిక కష్టాలు
ఇక, ప్రభుత్వం ఇదే అంశం పైన అధ్యయనం కోసం ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేసింది. ఈ కమిటీ సభ్యులు కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలు పైన క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షించారు. మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశమైన ఈ పథకం గురించి చర్చలు చేసారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి, అమలు ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ఆర్దిక ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. వచ్చే విద్య సంవత్సరం లో అమ్మ ఒడి... కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధుల వేళ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు.
ఉగాది నుంచి అమలు
అయితే, మహిళకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పైన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉగాది నుంచి ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ పథకం పై అధ్యయనం చేస్తున్న ముగ్గురు మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీనిని పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల మూడో వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ లోనూ ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications