దొంగలు, డెకాయిట్స్ లకు గురువు; దోచుకోవటంలో కలెక్షన్ కింగ్ చంద్రబాబు: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సందర్భం ఏదైనా సరే ఒకరినొకరు విమర్శించుకోవడమే లక్ష్యంగా వైసిపి, టిడిపి నేతలు పనిచేస్తున్నారు.తిరుపతిలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజా రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు.
చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై టిడిపి నేతలు ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సినిమాలలో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే దోచుకోవడంలో చంద్రబాబు కలెక్షన్ కింగ్ అంటూ మంత్రి రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి అక్రమాలపై సిబిఐ, ఈడి విచారణ జరపాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.

చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ఇంట్లో వేలకోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయని పేర్కొన్న రోజా దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక త్వరలో చంద్రబాబును తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేసీఆర్ తరిమేస్తాడు అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఉపాధ్యాయులను పూజించాలని పేర్కొన్న రోజా, తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానమని సూచించారు. ప్రతి ఒక్కరూ గౌరవించేది, గౌరవించాల్సింది ఉపాధ్యాయుడినేనని మంత్రి రోజా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలలను అభివృద్ధి చేసి, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు రోజా.
నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన అందిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిలిపారు అన్నారు. ఒకప్పుడు నారాయణ, చైతన్య స్కూల్లో చదవడానికి సీటు దొరికేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలకు తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్ దేనని పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులు సాధించారని మంత్రి రోజా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications