విడదల రజనీ ఆపరేషన్ అపోజీషన్ - మారుతున్న లెక్కలు..!!
ఏపీ ఎన్నికల్లో ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. సీఎం జగన్ టీడీపీ కంచుకోటలపై ఈ సారి వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందులో భాగంగా ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్దులను రంగంలోకి దింపారు. పార్టీ గెలవాల్సిందేనని నిర్దేశించారు. అందులో భాగంగా మంత్రి విడదల రజనీకి తొలి జాబితాలోనే గుంటూరు పశ్చిమం సీటు ఖరారు చేసారు. అక్కడ ఇంకా కూటమి అభ్యర్ది ఖరారు కాలేదు. ఈ సమయాన్ని రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు.
రజనీపై జగన్ నమ్మకం : గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు గెలవలేదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్దులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ నుంచి బీసీ అభ్యర్దినే బరిలో దింపింది. కానీ, టీడీపీ అభ్యర్ది మద్దాలి గిరి విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల తేడాతోనే వైసీపీ ఎంపీ సీటు కోల్పోయింది. దీంతో..ఈ సారి జగన్ గుంటూరు పశ్చమం పైన ప్రత్యేకం గా ఫోకస్ చేసారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజనీకి గుంటూరు పశ్చిమం బాధ్యతలు అప్పగించారు. అక్కడ వైసీపీ జెండా ఎగరాల్సిందేనని నిర్దేశించారు. రజనీ తనకు జగన్ అప్పగించిన టాస్క్ కు ఓకే చెప్పారు. దీంతో, నియోజకవర్గంలో ఎదరువతున్న సమస్యలను అధిగమిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

దూకుడుగా ముందుకు : గుంటూరు పశ్చిమంలో సామాజిక సమీకరణాలే గెలుపు ఓటములను నిర్దేశిస్తాయి. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావటంతో ఇక్కడ గెలుపు పైన టీడీపీ - జనసేన కూటమి ఆశలు పెట్టుకుంది. జగన్ వ్యూహాత్మకంగా ఇక్కడ రజనీకి సీటు కేటాయించారు. దీంతో, టీడీపీ -జనసేన నుంచి బీసీ అభ్యర్దిని దించాలంటే ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్ది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. బీసీ-మహిళా అభ్యర్ది కోసం పలు సర్వేలు చేయిస్తున్నారు. రోజుకో పేరుతో సర్వే కొనసాగుతోంది. ఆర్దికంగా రజనీ బలమైన అభ్యర్ది కావటంతో..ఆ స్థాయిలో పోటీ ఇచ్చే నేత కోసం అన్వేషిస్తున్నారు. ఈ సమయాన్ని రజనీ సద్వినియోగం చేసుకుంటున్నారు. దాదాపు రెండు నెలల కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతీ ప్రాంతంలో ప్రచారం కొనసాగిస్తున్నారు.

రజనీ కొత్త లెక్కలు : టీడీపీ, జనసేన నుంచి ఈ సీటు కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ, వారిలో సమర్ధమైన బీసీ అభ్యర్ది లేకపోవటం ఇప్పుడు రజనీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది. కూటమి అభ్యర్దిని ఖరారు చేసినా.. స్థానికంగా రెండు పార్టీల నుంచి ఉన్న ఆశావాహులు ఏ స్థాయిలో సహకరిస్తారనేది సందేహంగానే చెబుతున్నారు. టీడీపీతో గతంలో ఉన్న పరిచయాలు, స్థానికంగా రెండు నెలల నుంచి రజనీ టీం చేస్తున్న ఆపరేషన్ తో ప్రత్యర్ధి పార్టీల పైన దూకుడుగా వెళ్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలతో మమేకం అవుతూ భవిష్యత్ అభివృద్ధి పైన హామీలు ఇస్తున్నారు. చర్చా వేదికలు, సెమినార్లతో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో, అపోజీషన్ ను ఒక వైపు టార్గెట్ చేస్తూ..మరో వైపు ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో..రానున్న రోజులు రజనీ వ్యూహాలు ఏ మేర కలిసి వస్తాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications