రాజీ: సమైక్యంపై చేతులెత్తేసిన కేంద్ర మంత్రులు
హైదరాబాద్: సమైక్యాంధ్రపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు చేతులెత్తేసినట్లే కనిపిస్తున్నారు. రాజీనామాలు చేస్తామంటూ ముందుకు వచ్చిన వారు క్రమంగా రాజీ మార్గంలోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తాను రాజీనామా చేయబోనని కచ్చితంగా చెప్పారు. కానీ పలువురు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తామని ముందుకు వచ్చారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తాము రాజీనామాలు చేసినట్లు తెలిపారు.
రాజీనామాల విషయంలో వారు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజీనామాలు చేయడం వల్ల విభజన ఆగదని, అందుకే రాజీనామా చేయలేదని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మంగళవారం అన్నారు. తాము రాజీనామాలు చేసినా విభజన ఆగదని, అందువల్ల సీమాంధ్రకు కావాల్సిన వాటి కోసం డిమాండ్లు పెట్టడం మంచిదని మరో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

మరో కేంద్ర మంత్రి పళ్లంరాజుకు సోమవారం కాకినాడలో సమైక్య సెగ తగిలింది. ప్రధాని చెప్పడం వల్లనే తాము రాజీనామాలను ఆమోదింపజేసుకోలేదని, చివరి వరకు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మరో కేంద్ర మంత్రి జెడి శీలం కూడా రాజీనామా చేసే ఉద్దేశంతో లేనట్లే కనిపిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగించిన కావూరి సాంబశివ రావు కూడా రాజీనామా చేయడానికి సుముఖంగా లేరని అంటున్నారు.
చిరంజీవి మాత్రం రాజీనామా లేఖ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయనకు నియోజకవర్గ ప్రజల బాదరబందీ లేదు. మిగతా కేంద్ర మంత్రులకు మాత్రం నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితి ఉంది.
రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గడానికి కాంగ్రెసు అధిష్టానం ఏ మాత్రం ఇష్టంగా లేదు. ఆ విషయాన్ని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, రాష్ట్ర నాయకులకు కచ్చితంగా చెబుతూ వస్తోంది. విభజనపై వెనక్కి తగ్గబోమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మాత్రమే కాకుండా ఎఐసిసి అధికార ప్రతినిధులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.
దానికితోడు, రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో ఈ బృందం ఏర్పాటైంది. దానికి ఆంటోనీ నేతృత్వం వహిస్తున్నారు. అంతకు ముందు పార్టీపరంగా ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఆయన నేతృత్వంలోనే ఏర్పాటైంది. ఈ రెండు కూడా కంటితుడుపు చర్యగానే ఏర్పాటు చేసినట్లు సీమాంధ్ర నాయకులు విమర్సిస్తున్నారు. ఆంటోనీ కమిటీని తుంగలో తొక్కారని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ విమర్శించారు.












Click it and Unblock the Notifications