రైతులు ఇవ్వకుంటే బలవంతంగానే...: పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని తూళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే నోటిఫికేషన్ జారీ చేసి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైతులను ఒప్పించి భూములు సేకరించాలని, బలవంతంగా తీసుకోకూడదని పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వానికి సూచించారు.
అయితే అమరావతి పరిధిలో ఇంకా 300 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉందనీ, ఇప్పటికే ఈ 300 ఎకరాలకు చెందిన రైతులకు భూమిని ఇవ్వాల్సిందిగా కోరినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వారు 15 రోజుల్లోపు భూమిని ప్రభుత్వానికి అప్పగించకుంటే భూ సమీకరణ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన గురువారంనాడు తెలిపారు. బుధవారంనాడు మంత్రి పత్తిపాటి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
Cartoon: Pawan Kalyan's Jana Sena gets EC recognition
రాజధాని భూముల్లో రైతులు ఇవ్వనిరాకరించిన భూములు మధ్య మధ్యలో ఉన్నాయని, రాజధానిలో రోడ్లు వేయాలన్నా, ఇతర పనులు చేపట్టాలన్నా అవి అడ్డంకులు కల్పిస్తాయని, అందువల్ల వాటిని తీసుకోక తప్పదని నారాయణ అన్నారు. అంటే, బలవంతంగానైనా సరే ఆ భూములను సేకరిస్తామని ఆయన చెప్పినట్లే లెక్క.
మంత్రి నారాయణ ప్రకటనపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ గుజరాత్ లో తన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ షెడ్యూలును ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఆయన రైతుల భూముల వ్యవహారంలో మాట్లాడేందుకే వచ్చినట్లు చెపుతున్నారు.

గుజరాత్‌లో సినిమా షూటింగులో ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాలేదు. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్ నిమిత్తం గుజరాత్ వెళ్ళి అక్కడ యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ చేసివచ్చాడు. ప్రస్తుతం నాలుగు రోజులు బ్రేక్ ఇచ్చి నవంబర్ మొదటి వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఫ్రెష్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేయనున్నారు.
సుమారు 20 రోజుల పాటు జరిగే హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం, మేజర్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ అతి వేగంగా ఈ సినిమాని పూర్తిచేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారి కాజల్ అగర్వాల్ జోడీ కడుతున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.
లక్ష్మీరాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడమే కాకుండా ఓ ముఖ్య పాత్రలో కూడా కనిపించనుంది. పవన్ క్లాస్‌మేట్ శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.












Click it and Unblock the Notifications