కాణిపాకం ఆలయంలో స్వామివారి పాత రథచక్రాలకు నిప్పుపెట్టిన దుండగులు; సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య కాణిపాకం ఆలయంలో పాత రథచక్రానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఆలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా ఆందోళనలు కొనసాగుతుంటే తాజాగా మరోమారు కాణిపాకం ఆలయంలోని పాత రథచక్రానికి దుండగులు నిప్పు పెట్టడం ఆందోళనకు కారణమైంది.

కాణిపాకం ఆలయ పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు
కాణిపాకం ఆలయంలోని పాత రథం శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని గత కొంతకాలంగా గోశాల పక్కనే ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపగా, ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది గుర్తుతెలియని వ్యక్తులు తెలియక చేసిన పనా లేక కావాలనే ఎవరైనా స్వామివారి ఆలయ రథ చక్రాలకు నిప్పు పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

దేవాలయాలపై దాడులు తగ్గాయని భావిస్తున్న సమయంలో ఘటన
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరోమారు ఆందోళనకు కారణంగా మారింది. అయితే ఆలయాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడాలని ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన క్రమంలో అన్ని ఆలయాలలోనూ గతంలోనే సి సి కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న సంఘటన ఆలయాలలో భద్రతా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుందని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయి.

సీసీ కెమెరాల ఆధారంగా రథ చక్రాలు తగలబెట్టిన వారిని గుర్తించిన ఆలయ అధికారులు
కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని 11వ శతాబ్దానికి చెందిన గణపతి దేవాలయం. పాత రథ చక్రాలు ఇతర స్క్రాప్ వస్తువులన్నీ ఆలయానికి అర కిలోమీటరు దూరంలో ఉంచబడ్డాయి. ఇక ఇవి ఆగంతకులు నిప్పు పెట్టటంతో కాలిపోయినట్లు గుర్తించారు.ఆలయ భద్రతా సిబ్బంది ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగులను గుర్తించారు.ఇప్పటి వరకు ఆలయ అధికారుల నుండి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డిపిఓ) తెలిపారు.

పాత రథ చక్రాలు తగలబెట్టిన ఘటనపై ఆలయ ఈవో చెప్పిందిదే
ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆలయ రథాలకు సంబంధించిన అన్ని వస్తువులను షెడ్లలో జాగ్రత్తగా భద్రపరిచి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.15 సంవత్సరాల క్రితం తొలగించబడిన రథ చక్రాలను ఆలయానికి అర కిలోమీటరు దూరంలో ఉంచారు. వాటిని బహిరంగ ప్రదేశంలో ఉంచామని, వాటిని రోడ్లు ఊడ్చే పారిశుధ్య సిబ్బంది తగలబెట్టారని ఈవో చెప్పారు.

గతంలో అంతర్వేది స్వామివారి రథానికి నిప్పు
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అంతర్వేదిలో స్వామివారి రధాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన దుమారం రేపిన విషయం తెలిసిందే . అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ నేటికీ అంతర్వేది ఘటన ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఏపీలో దుమారంగా రామతీర్ధం ఘటన, బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు మాయం ఘటనలు
ఆ తరువాత వరుసగా రాష్ట్రంలో ఆలయాలలో వివిధ సంఘటనలు చోటు చేసుకున్నాయి. బెజవాడ కనకదుర్గమ్మ వెండి రథానికిఉండాల్సిన 4 సింహాలలో 3 చోరీకి గురికావడం, చారిత్రాత్మక రామతీర్థ క్షేత్రంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన సంఘటన... ఇలా అనేక వరుస సంఘటనలు ఏపీలో చోటుచేసుకున్నాయి. ఏపీలో దేవాలయాల భద్రతను ఈ ఘటనలు ప్రశ్నించాయి.












Click it and Unblock the Notifications