ఎరక్కపోయి మాట్లాడి ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే రాపాక; దొంగ ఓట్ల వ్యాఖ్యలపై క్లారిటీ.. నమ్ముతారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రగడ కొనసాగుతుండగానే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారి రసకందాయంలో పడేశాయి. జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు పది కోట్ల ఆఫర్ వచ్చిందని, తెలుగుదేశం పార్టీ నేతలు తనను సంప్రదించారని వ్యాఖ్యలు చేయడంతో పాటు తాను దొంగ ఓట్లతోనే గెలిచానని, తనపై తానే బాంబు పేల్చుకున్న ఘటన రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వ్యాఖ్యల వీడియో బయటకు రావడంతో డిఫెన్స్ లో పడిన రాపాక వరప్రసాద్ తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
అది పూర్తిగా వాస్తవమని, ఆత్మీయ సమ్మేళనం లో తాను ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నానని, అయితే తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో రాపాక ను టార్గెట్ చేయడానికి టిడిపి, వైసిపి, జనసేన నేతలు రెడీ అయ్యారు.

గత ఎన్నికలలో రాపాక వరప్రసాద్ పై పోటీ చేసిన నేతలు ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళతామని, దీనిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్తున్నారు. ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన రాపాక సొంతూరు చింతలమోరులో పడిన దొంగ ఓట్ల గురించి చెప్పుకొస్తూ, తన అనుచరులు అందరూ ఒక్కొక్కరు తనకు 10 ఓట్లు వేస్తేనే తనకు 800 ఓట్లు మెజారిటీ వచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో దొంగ ఓట్లతో గెలిచిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ ఒక్కసారిగా వ్యవహారం రాపాకకు రివర్స్ అయింది.
ఇక రాపాక వరప్రసాద్ ను సొంత పార్టీ నేతలే ఇరికించారన్న చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు రాపాక వరప్రసాద్ అదంతా వట్టిదే.. తూచ్ అని చెప్పినా ఎవరు పట్టించుకునే వారే లేరు. అనవసరంగా నోరు జారి ఇబ్బందుల్లో పడిన రాపాక వరప్రసాద్ నిన్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చిన రాపాక వర ప్రసాద్ జనాలను నమ్మించడానికి నానా పాట్లు పడుతున్నారు. మరి అదేం లేదని చెప్తున్న రాపాక మాటలు జనం నమ్ముతారా అంటే కష్టమే అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications