రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు ఎలా పట్టుకున్నారు?
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరంగా ఉంది. సికింద్రాబాదులోని లాలాగుడా విజయపురి కాలనీ పుష్పా నిలయం అపార్టుమెంటులో గల స్టీఫెన్ సన్ కుమారుడి ఇంట్లో ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
అయితే, రేవంత్ రెడ్డి వద్ద ఏ విధమైన డబ్బులు కూడా దొరకలేదని టిడిపి నాయకులు అంటున్నారు. కానీ స్టీఫెన్ సన్ 5 కోట్ల రూపాయలకు బేరసారాలు ఆడారని, రూ. 50 లక్షలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులు పట్టుకున్నారని చెబుతున్నారు.

తను పట్టుబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నిలబెట్టిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. శనివారంనాడే ఓ శాసనసభ్యుడు టిఆర్ఎస్‌లో చేరడం, మరో ఇద్దరు ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ వైపు వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి విజయం డోలాయమానంలో పడిందని అంటున్నారు. అందుకే, ఏ విధంగానైనా వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించడమే శాపంగా మారినట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి మూడు రోజుల క్రితం స్టీఫెన్ సన్‌ను సంప్రదించినట్లు, ఆయనను బుజ్జగించి ప్రిఫరెన్షియల్ ఓటు వేయించుకోవడానికి ప్రయత్నించినట్లు, దీనిపై స్టీఫెన్ సన్ ఎసిబికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం పథకం ప్రకారం ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు ఎసిబి అధికారులు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. స్టీఫెన్ సన్ కుమారుడి నివాసం వద్ద మాటు వేసిన ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డి క్యాష్ బాక్స్ తెరవగానే పట్టుకున్నట్లు చెబుతున్నారు. పూర్తి వ్యవహారాన్ని ఎసిబి అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు సమాచారం.
ఎసిబి అధికారులు మొత్తం నగదును కూడా లెక్కించినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఎసిబి అధికారులు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications