అమిత్ షాతో మెగాస్టార్, మెగా పవర్ స్టార్: ఢిల్లీ వెళ్లి మరీ..!!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దేశ రాజధానిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. పలు అంశాలపై చర్చించారు.
అమరావతి/న్యూఢిల్లీ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి తెలియజేసిన మూవీ- ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్లు 1,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేశాయి. ఈ ఏడాది జనవరిలో గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డును అందుకుంది.
తాజాగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను అందుకుందీ సినిమా. ఇందులోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. ఇటీవలే అమెరికా లాస్ ఏంజిలిస్ లోని డాల్బీ థియేటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

కాగా- ఈ అవార్డు దక్కడంపై చిత్రం యూనిట్ పై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, చిత్ర పరిశ్రమ పెద్దలు ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అసాధ్యంగా భావించిన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు.

తాజాగా- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. చిత్రం యూనిట్ ను అభినందించారు. దీనికోసం ఆయన అదే పనిగా ఆయన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఈ సాయంత్రమే వారిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందటే వారిద్దరూ అమిత్ షాను కలుసుకున్నారు. శాలువా కప్పి సన్మానించారు. ఆర్ఆర్ఆర్ గురించి ఆరా తీశారు. ఆస్కార్ అవార్డు విశేషాలను ఈ సందర్భంగా రామ్ చరణ్.. ఆయనకు వివరించారు.
#WATCH | Union Home Minister Amit Shah met RRR fame actor Ram Charan and his father Chiranjeevi in Delhi. Home Minister congratulated them after 'Naatu Naatu' won Oscars pic.twitter.com/Tumzecmzev
— ANI (@ANI) March 17, 2023
ఇదివరకు అమిత్ షా.. హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ ఉదంతం అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ రంగు పులుముకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా రాజకీయాల్లోకి ఆహ్వానించారనే ప్రచారం భారీగా జరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ప్రచార సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయాలు సైతం అప్పట్లో వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications