ఏపీకి గుడ్ న్యూస్: అక్కడ అధిక వర్షపాతం నమోదు
AP Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తోన్నాయి. మొన్నటివరకు నిప్పులు చెరిగిన ఎండ తీవ్రత గణనీయంగా తగ్గింది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతోంది. వాతావరణం చల్లగా మారింది. సకాలంలో కురుస్తోన్న వర్షాల వల్ల పలుచోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ మొదలుకుని ఉత్తరాంధ్ర వరకు ఆశించిన స్థాయి కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. మరి కొన్ని చోట్ల పిడుగులు సైతం పడ్డాయి.

ఆదివారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. 64.5 నుంచి 115 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మరో 205 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడినట్లు వివరించారు.
ఆ ప్రాంతాల్లో 15.6 నుంచి 64.4 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అత్యధిక వర్షపాతం అనకాపల్లి జిల్లాలో నమోదైంది. జిల్లాలోని నర్సీపట్నంలో 125.7 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ సాయంత్రం లోగా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications