చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న పవన్ - అసలు టార్గెట్ ఏంటి ?
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపైనే చర్చ జరుగుతోంది. తాజాగా పిఠాపురం టూర్ లో మహిళలపై అత్యాచారాల విషయంలో పోలీసుల వైఖరిపై వవన్ రెచ్చిపోతే అది యథాలాపం అనుకున్నారు. దళిత, మహిళా హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు ఎక్కుపెడితే అది సందర్భానుసారం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పవన్ కేబినెట్లోనే పోలీసుల్ని టార్గెట్ చేస్తూ చేశారంటున్న విమర్శలు చూస్తుంటే ఈ వివాదం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.
వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నా పట్టించుకోరా అంటూ నిన్న కేబినెట్ భేటీలో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
పోస్టులు పెడుతున్న వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోరా వీళ్లు అంటూ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రివర్గ సహచరుల్ని ప్రశ్నించారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, గతంలో జగన్ కు వత్తాసు పలికిన పోలీసులే ఇప్పుడూ కీలక పోస్టుల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఇలా అయితే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్ట్ కావడం లేదని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారన్నారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా అని పవన్ ప్రశ్నించారు. అందువల్లే తాను పిఠాపురంలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందన్నారు. దీంతో ఆయనకు సర్దిచెప్పేందుకు నేరుగా సీఎం రంగంలోకి దిగారు.
కేబినెట్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం వల్లే పోలీసులు ఆలా తయారంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎప్పటికప్పుడు మాట్లాడుకుందామని పవన్ కు సూచించారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిద్ధామన్నారు. సోషల్ మీడియా పోస్టులపైనా ఇక ఉపేక్షించేది లేదన్నారు.
ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఘటనలన్నీ రిపీట్ అవుతున్నా సొంత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్షంగా ఉందన్న ఆవేదన పవన్ లో కనిపిస్తోంది. అలాగే పిఠాపురంలో తన వ్యాఖ్యలపై కేబినెట్ సహచరుల్లో అసంతృప్తి ఉందని భావించడం వల్లే పవన్ ఇలా వివరణ ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా నెల రోజుల్లో లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెడతానని పవన్ కు హామీ ఇచ్చిన చంద్రబాబు ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications