ఏపీలో ప్లాన్ మార్చిన పార్టీలు ? వ్యూహాలకు సెలవు ? మార్కెటింగ్ తోనే 2024 రోడ్ మ్యాప్ ?
ఏపీలో వైసీపీ గృహసారధుల నియామకం, వారికి పోటీగా టీడీపీ కుటుంబ సాధికార సారధుల నియామకం చూస్తుంటే ఈసారి ఎన్నికలు వ్యూహాల మధ్య పోరుగా కాకుండా మార్కెటింగ్ పోరుగా మారిపోతున్నాయి.
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్దమవుతున్న అధికార వైసీపీ,విపక్ష టీడీపీ ఇప్పుడు రాజకీయాన్ని మరో మలుపు తిప్పేస్తున్నాయి. గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలకు, సామాజిక సమీకరణాలకు పదునుపెట్టి విజయతీరాలకు చేరుకున్న వైసీపీతో పాటు, అవేవీ లేకుండా కేవలం ప్రభుత్వ పాలననే నమ్ముకుని ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ సైతం ఇప్పుడు తాజా వ్యూహానికి తెర లేపుతున్నాయి. చంద్రబాబు గత ఓటమి నేర్పిన అనుభవంతో జగన్ కూడా ఇప్పుడు ఈ కొత్త వ్యూహానికి పదునుపెడుతున్నారు.

ఏపీలో హైఓల్జేజ్ పాలిటిక్స్
ఏపీలో రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల్లో తొలిసారి వ్యూహకర్తల్ని నియమించుకుని ప్రత్యర్ధిపై పైచేయి సాధించిన వైసీపీ అనుభవంతో తాను కూడా వ్యూహకర్తను నియమించుకున్న చంద్రబాబు... ఇప్పుడు వైసీపీ గృహసారధుల నియామకంతో తాను కూడా కుటుంబ సాధికార సారధుల నియామానికి సిద్ధమయ్యారు. తద్వారా వ్యూహాల నుంచి మార్కెటింగ్ కు మారిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో ఏ వ్యూహం తుదికంటా ఫలిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్దితి. అందుకే ముందు జాగ్రత్తగా సేఫ్ గేమ్ కు వీరు తెరలేపోతున్నారు.

వ్యూహాలకు కాలం చెల్లిందా ?
గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కీలకంగా మారాయి. దీంతో వైసీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు సాధించి ఏపీ రాజకీయాల్నే ఏకపక్షంగా మార్చేసింది. కానీ ఆ తర్వాత జరిగిన స్ధానిక ఎన్నికల్లో వైసీపీ సొంత వ్యూహాలతోనే బరిలోకి దిగి గెలిచింది. ఆ తర్వాత పలు ఉపఎన్నికలు వచ్చినా జగన్ సొంత వ్యూహాల్నే నమ్ముకున్నారు. కానీ జగన్ విజయం తర్వాత చంద్రబాబు తానూ రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను నియమించుకున్నారు. కానీ ఎక్కడా విజయాలు సాధించలేకపోయారు. దీంతో వ్యూహకర్తలకు, వారి వ్యూహాలకు కాలం చెల్లిందనే ప్రచారం మొదలైంది. ఇదే ఇవ్పుడు వైసీపీని సైతం కలవరపెడుతోంది. గత ఎన్నికల్లో రచించిన వ్యూహాలు రిపీట్ చేయలేని పరిస్దితి, అలాగని కొత్త వ్యూహాల్ని సైతం అమలు చేసే పరిస్ధితి లేకపోవడంతో టోటల్ గా ఈ వ్యూహాల రాజకీయానికి వీరిద్దరూ చెక్ పెట్టేసినట్లే కనిపిస్తోంది. పేరుకు వ్యూహకర్తలు ఉన్నా వారు కేవలం సర్వేలు, రిపోర్ట్ లు ఇచ్చేందుకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది.

మార్కెటింగ్ కే జగన్, చంద్రబాబు మొగ్గు ?
గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకంగా మారిన వ్యూహకర్తల్ని, వ్యూహాల్ని తిరిగి నమ్ముకునే పరిస్దితి అటు జగన్ కు కానీ, ఇటు చంద్రబాబుకు కానీ లేవు. దీంతో వ్యూహాల స్ధానంలో మార్కెటింగ్ వచ్చి చేరింది. ఇప్పుడు వైసీపీ నియమించిన గృహసారధులతో పాటు టీడీపీ నియమించబోతున్న కుటుంబ సారధులు సైతం మార్కెటింగ్ కే పనికొస్తారనే అంచనాలున్నాయి. వైసీపీ పథకాల్ని, టీడీపీ గతంలో చేయలేనివి, ఇప్పుడు వైసీపీ చేసినవీ జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు గృహసారధులు ఉపయోగపడనుండగా.. వైసీపీ సర్కార్ వైఫల్యాలు, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరించేందుకు కుటుంబ సారధులు ఉపయోగపడతారని భావిస్తున్నారు. దీంతో ఈ మార్కెటింగ్ వ్యూహాన్నిఇరు పార్టీలు ఏ స్ధాయిలో అమలు చేస్తాయన్న దానిపైనే వచ్చే ఎన్నికల ఫలితాలు ఆధారపడబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications