అడ్డు: ప్రియుడితో కలిసి మద్యం తాగించి 4ఏళ్ల కొడుకును చంపిన తల్లి
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన కన్న కొడుకుకు మద్యం తాగించి, ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ కిరాతక తల్లి. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
తమిళనాడులోని మధురైకి చెందిన శివానందం మూడు నెలల క్రితం వడమాలపేటలోని సన్నిధి వీధిలో కిరాయికి దిగాడు. అతనితో పాటు ప్రియురాలు వనిత, ఆమె కుమారుడు నాలుగేళ్ల నదీష్ వచ్చారు. చిన్నారిని గతంలోను పలుమార్లు శివానందం, వనితలు కొట్టారని స్థానికులు చెబుతున్నారు.
ఆదివారం తన నాలుగేళ్ల చిన్నారి నదీష్‌కు ఆరోగ్యం బాగా లేదని చెప్పి ఆటోలో తిరుపతికి తీసుకు వెళ్లారు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. నదీష్ ఆరోగ్యం ఎలా ఉందని స్థానికులు అడిగితే.. బాగుందని, బంధువుల ఇంట్లో ఉందని చెప్పారు.

ఆ తర్వాత అక్కడి ఇల్లు ఖాళీ చేసి మరో వీధిలోకి వచ్చారు. అయితే, శివానందం, వనితల తీరు అనుమానంగా ఉండటంతో స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా.. బిడ్డను చంపేసినట్లు అంగీకరించారు.
మధురైకి చెందిన వనితకు శివకార్తీక్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో విడిపోయినట్లుగా తెలుస్తోంది. అనంతరం శివకార్తీక్ మలేషియా వెళ్లాడు. అతను అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడని తెలుస్తోంది.
వనిత నదీష్‌కు జన్మనిచ్చిన మధురైలో ఉండగా రెండేళ్ల క్రితం శివానందంతో పరిచయం ఏర్పడింది. అనంతరం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురు కలిసి జీవించసాగారు.
ఆదివారం నాడు మందు తాగించి నీటి తొట్టెలో ముంచి ఆ తర్వాత అనారోగ్యంగా ఉందని చెప్పి తిరుపతికి తీసుకు వెళ్లారు. డాక్టర్లు చనిపోయారని చెప్పడంతో... బస్టాండులో వనితను ఉంచిన శివానందం కూలీలకు డబ్బులిచ్చి ఖననం చేయించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం పోలీసులు శివానందం ఇంట్లో సోదాలు చేశారు. ఖననం చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications