జానా మధ్యవర్తిత్వం: కాంగ్రెసు వైపు మోత్కుపల్లి
హైదరాబాద్: రాజ్యసభ సీటు నిరాకరించడం ద్వారా తనకు అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహాలు కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ముమ్మర ప్రచారం సాగుతోంది.
మోత్కుపల్లి నర్సింహులును కాంగ్రెసు పార్టీలోకి తెచ్చేందుకు మంత్రి జానారెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దళిత నేతను ఆహ్వానిస్తే ఇమేజ్ పెరుగుతుందని జానారెడ్డి వాదనలతో అధిష్టానం కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి రాకతో జిల్లాలో తనకూ కలిసి వస్తుందని జానారెడ్డి భావిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో కాంగ్రెసు వైపు చాలా రెడ్లే ఉన్నారు. ఈ స్థితిలో రాష్ట్రవ్యాప్తంగా పలుకుబడి ఉన్న దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు వస్తే ఆ అప్రపథ పోతుందనే భావన కాంగ్రెసు నాయకుల్లో ఉన్నట్లు సమాచారం. అయితే, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది చూడాల్సి ఉంది.
మోత్కుపల్లికి రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై నల్గొండ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న మోత్కుపల్లిని కాదని మరొకరికి రాజ్యసభ సీటు ఇవ్వడం మంచిది కాదని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు మోత్కుపల్లిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం.












Click it and Unblock the Notifications