వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను అడుగడుగున మోసం చేస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పది కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేని వైసీపీ ప్రభుత్వం మూలపేట పోర్టును నిర్మిస్తుందా అంటూ ప్రశ్నించారు.
మూలపేట పోర్ట్ శంకుస్థాపన ద్వారా శ్రీకాకుళం ప్రజల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి మోసం చేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్లు దండుకోవడానికి పోర్టు శంఖుస్థాపన నాటకం ఆడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకు రాకుండా ఉన్నవాటికి ఉద్వాసన పలికిన జగన్ సర్కార్ రాష్ట్రంలో వేల ఉద్యోగాలను ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరు చెప్పి ఏపీని సర్వనాశనం చేసి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టేస్తాను అంటూ ఇప్పుడు మళ్లీ వ్యాఖ్యలు చేయడం, వివేకా హత్య కేసు నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జగన్ విశాఖ రాజధాని అని పదేపదే చెబుతున్నా జనాలు నమ్మడం లేదని విశాఖ రాజధానిని ప్రజలు నమ్మడం లేదని ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో కొత్తడ్రామాలు మొదలు పెట్టారన్నారు. విశాఖ పూర్తిగా కబ్జా చేయడానికి సెప్టెంబర్ నుంచి కాపురం అంటున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు ముగిసిన అధ్యాయం అని చెబుతున్నా, ఏపీకి అమరావతిని రాజధాని అని చెబుతున్నా జనాలను పదేపదే ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం కొత్తగా స్టిక్కర్ల రాజకీయం చేస్తోందంటూ పేర్కొన్న ఆయన జనాలు ఇళ్లకు బలవంతంగా స్టిక్కర్లు వేస్తుంటే ప్రజలు వాటిని చించేస్తున్నారంటూ, సోషల్ మీడియాలో వీటిపైన సెటైర్లు కూడా వేస్తున్నారు అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కోడి కత్తితో ఆస్కార్ లెవల్లో డ్రామా ఆడి, అధికారంలోకి వచ్చిన తర్వాత అమాయకుడిని జైలుపాలు చేసి అతని భవిష్యత్ నాశనం చేశారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications