వెధవకూతలు కూస్తే నాలుక కోస్తా: చింతమనేనికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ హెచ్చరిక
ఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చింతమనేనిదిగా చెబుతోన్న వీడియోపై స్పందించారు. దళితులపై వెధవకూతలు కూస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు. నీతో పాటు కులగజ్జి ఉన్న నేతలందరికీ బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించారు. దళితులు రాజకీయాలకు పనికిరారా అని ప్రశ్నించారు.

దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదన్నారు. దళితులు రాజకీయాలకు పనికిరారంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నోటి దురసు, కుల గజ్జితో మాట్లాడుతున్నావని, అంబేద్కర్ భిక్ష వల్లే నువ్వు ఎమ్మెల్యేగా తిరుగుతున్నావని, దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే రాజకీయంగా సమాధి కావడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు.
మరోవైపు, చింతమనేని ప్రభాకర్ పైన జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ ఈ ఫిర్యాదు చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో ఇటీవల కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆయన ఎస్సీ సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించారంటూ ఓ వీడియో వెలుగు చూసింది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications