వివేకా రెండో వివాహం-పేరు మార్చుకున్నారు, ఆస్తి కోసమే: ఎంపీ అవినాష్ రెడ్డి సంచలనం..!!
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పైన ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్ట్ చేయటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. సీబీఐ కీలకమైన అంశాలను విస్మరిస్తోందని చెప్పుకొచ్చారు. సిల్లి విషయాలను సీరియస్ గా తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. కీలకమైన లెటర్ దాచి పెట్టమని చెప్పిన సునీత భర్త రాజశేఖర రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించదని ప్రశ్నించారు. సునీత టీడీపీ అధినేత చంద్రబాబు తో చేతులు కలిపారని ఆరోపించారు. వివేకా రెండో భార్య..కుమారుడు గురించి అవినాష్ రెడ్డి కీలక అంశాలు వెల్లడించారు.
చంద్రబాబుతో సునీత చేతులు కలిపారు : తండ్రి అరెస్ట్ సమాచారంతో ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వాస్తవాలు చెప్పినా సీబీఐ విచారించే పరిస్థితిలో లేదని చెప్పుకొచ్చారు. విచారణలో సీబీఐ అనేక కీలక విషయాలను వదిలేసిందన్నారు.

హత్య గురించి ముందుగా పోలీసులకు చెప్పింది తానేనని గుర్తు చేసారు. వెంటనే ఘటనా స్థలికి రావాలని మూడు సార్లు కోరినట్లు వెల్లడించారు. తన కంటే గంట ముందే సునీత భర్త రాజశేఖర్ రెడ్డిక హత్య గురించి తెలుసని చెప్పారు. సమాచారం ఇచ్చిన తననే దోషిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వాస్తవాల ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు.
రెండో భార్యకి ఆస్తి ఇవ్వాలని : వివేకానంద రెడ్డికి ముస్లిం మహిళతో రెండో వివాహం జరిగిందన్నారు. 2010 లో వివేకా తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని చెప్పుకొచ్చారు. వారికి షాజహాన్ అనే కుమారుడు ఉన్నాడని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు. రెండో భార్యకు ఆస్తి ఇవ్వాలనుకున్నారని చెప్పుకొచ్చారు.

సునీత కొంత కాలం బాగానే ఉన్నారని..తరువాత చంద్రబాబుతో చేతులు కలిపారని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీబీఐ - సునీత ఒక్కటేనని చెప్పుకొచ్చారు. వాచ్ మెన్ రంగన్న హత్య కేసులో నలుగురి పేర్లు చెప్పాడన్నారు. హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్ గా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం అప్రూవర్ విచారణ పూర్తయ్యే వరకూ జైల్లోనే ఉండాలని చెప్పారు.
నిజాయితీ నిరూపించుకుంటా : సీబీఐ వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని విచారణ చేస్తుందన్నారు. సీబీఐ విచారణ సరిగ్గా జరగటం లేదని అవినాష్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటూ నిజాయితీ నిరూపించుకుటామని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పపారు. స్టాంప్ పేపర్లు పోతే విచారణ జరపడం లేదన్నారు. కాగా, పులివెందులో అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సీబీఐ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం రిమాండ్ కోరే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications