పవన్ ను ఓడించి తీరుతా - లేకపోతే పద్మనారెడ్డిగా పేరు మార్చుకుంటా - ముద్రగడ ఛాలెంజ్!
ఏపీలో ఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ కాపు నేతల్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ విమర్శలపై స్పందిస్తూ..ఆయనకు ఆ అర్హత లేదన్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు. అలాగే కాపు రిజర్వేషన్ల ఉద్యమంపైనా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ ఎమ్మెల్యేలను కాపు రిజర్వేషన్ ఎందుకు అడగలేదని పవన్ అడుగుతున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలను అడిగే హక్కు మీకెక్కడిది అని ముద్రగడ ప్రశ్నించారు. కాపg ఉద్యమంలో మీ పాత్ర లేదు, సానుభూతి కూడా చూపించలేదన్నారు. తనకు ఉత్తరం కూడా రాయలేదని, తననూ తిడుతున్నారన్నారు. జగన్ జగ్గంపేటలో రిజర్వేషన్ ఇవ్వనంటే నోర్మూసుకుని కూర్చున్నారని తనను తిడుతున్నారని ముద్రగడ ఆక్షేపించారు.

తాను చవటను, దద్దమ్మను, ఆవేశం లేని వాడినే అని కానీ మీకు అవన్నీ ఉన్నాయిగా మీరెందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు.తన అంతట తానే కాపు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కానని, జగన్ సాధ్యం కాదంటే నోర్మూసుకుని కూర్చున్నానని ముద్రగడ తెలిపారు. ఇస్తానన్న వారిని అడక్కపోవడం తప్పు కాదా, ఇవ్వనన్న వారిని అడగడం తప్పా అని ప్రశ్నించారు. జక్కంపూడి రాజాను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని తిట్టారని, నన్నయ్య యూనివర్శిటీలో కమిషన్లు తీసుకున్నారని చెప్పారని, గతంలో మీరు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ కూ నాయకత్వం వహించారా లేకపోతే అలా చెప్పలేరుగా అన్నారు.
దారుణమైన ఆరోపణలు చేసి వాటికి రిప్లై ఇస్తే సమాధానం ఇవ్వట్లేదని పవన్ తీరుపై ముద్రగడ మండిపడ్డారు. మేం మీ మోచేతి నీళ్లు తాగుతున్నామా అని అడిగారు. పవన్.. మీది ఏ ఊరు, మండలం, జిల్లా తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చేయాలా అని అడిగారు. మా జిల్లా వాళ్లంటే లోకువా అని అడిగారు. హైదరాబాద్ లో పోటీ చేయొచ్చుగా అని ప్రశ్నించారు.
పవన్ ను ఓడించి పంపడం ఖాయమని, ఓడించి పంపకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. మేం మీ బానిసలమా మీకు ఓటేయడానికి అని అడిగారు. పవన్ సమస్యలు, పద్ధతులు తెలుసుకుని మాట్లాడాలన్నారు. నోరుంది, ముఖానికి రంగుందని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదన్నారు. పిఠాపురం నుంచి త్వరలో మిమ్మల్ని తన్ని తరిమేస్తారన్నారు.
ప్రధానికి చెప్పి పవన్ కట్టిస్తానన్న ప్రత్యేక జైలు చంద్రబాబు కోసమా అని ముద్రగడ ప్రశ్నించారు. అంత పలుకుబడే ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని అడిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదని, పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలని ఎందుకు అడగరన్నారు.












Click it and Unblock the Notifications