అమరావతికి రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము- సీఎం నివాసంలో విందు: టీడీపీ హాజరయ్యేనా ..!!
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో నిలిచిన ఎన్డీఏ అభ్యర్ది ద్రౌపది ముర్ము ఏపీకి రానున్నారు. 12వ తేదీన హైదరాబాద్ లో ఉదయం తెలంగాణ బీజేపీ ఎంపీలు - ఎమ్మెల్యేలతో ముర్ము సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని కోరనున్నారు. అక్కడ నుంచి గన్నవరం చేరుకోనున్నారు. సీఎం జగన్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ముర్ముకు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి మంగళగిరి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో వైసీపీ ఎంపీలు - ఎమ్మెల్యేలతో ముర్ము సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో ముర్ముకు మద్దతు అంశం పైన సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు.

వైసీపీ నేతలతో ముర్ము సమావేశం
ఆ తరువాత ముర్ము సైతం ప్రసంగం ఉంటుంది. తనకు మద్దతుగా నిలవాలని వైసీపీ నేతలను కోరనున్నారు. ముర్ము ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రకటించే సమయంలోనే వైసీపీ మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నా.. కేబినెట్ సమావేశం కారణంగా హాజరు కాలేదు. సీఎం ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి హాజరయ్యారు. ఇక, మంగళగిరిలో సమావేశంలో ముగిసిన తరువాత ద్రౌపది గౌరవార్ధం సీఎ జగన్ తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేసారు.

ముఖ్యమంత్రి తేనేటి విందు
ముర్ము సీఎం నివాసంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఎవరికనే అంశం పైన ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. అటు ఎన్డీఏ- ఇటు యశంత్ సిన్హాను ప్రతిపాదించిన విపక్ష పార్టీలు సైతం టీడీపీ మద్దతు కోరలేదు. దీంతో.. టీడీపీ ఇప్పటి వరకు తటస్థ వైఖరితోనే ఉంది. చివరి నిమిషంలో తమను ఎవరు సంప్రదిస్తే వారికి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం రానుండటంతో.. ముర్ము వైపు చంద్రబాబు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

నిర్ణయం తీసుకోని టీడీపీ
దీంతో..అమరావతికి వస్తున్న ముర్మును టీడీపీ అధినేత చంద్రబాబు కలుస్తారా.. కలవరా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీకి నుంచి ఎలక్టోరల్ కాలేజ్ లో ముగ్గురు ఎంపీలు.. 23 మందిలో 20 మంది ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఇది స్వల్పమే అయినా.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీగా.. టీడీపీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎవరికి మద్దతుగా నిలుస్తుందీ.. ముర్ము పర్యటన సమయంలో ఏ రకంగా వ్యవహరిస్తుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications