టీడీపీకి మరో షాక్: మాజీ మంత్రి హనుమంతరావు పార్టీకి రాజీనామా, జగన్‌పై ప్రశంసలు
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. పార్టీకి తన అవసరం లేనందునే రాజీనామా చేస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు.
పార్టీ ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా.. తన సేవలను వినియోగించుకోవడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలోనే తాను టీడీపీని వీడుతున్నట్లు మురుగుడు హనుమంతరావు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని అన్నారు.

అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. అంతేగాక, జగన్ వైసీపీలోకి ఆహ్వానిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని హనుమంతరావు తెలిపారు. తన శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని హనుమంతరావు తెలిపారు.
తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండే ఆప్కోకి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను హనుమంతరావు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది బోర్డు సభ్యులు ఉన్నారన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే ఆప్కో అభివృద్ధి చెందడం సాధ్యం కాదన్నారు. అదే కారణంతో తాను టీడీపీలోకి వచ్చానని.. చంద్రబాబు తనను మంగళగిరి డిగ్రీ కాలేజీలో పార్టీలోకి ఆహ్వానించారన్నారు.
టీడీపీ హయాంలో ఆప్కోకి ఎటువంటి ప్రయోజనం కలగలేదని.. ప్రస్తుతం మన మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. కాగా, మురుగుడు హనుమంతరావు 1999, 2004లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. మంత్రిగా కూడా పని చేశారు.
కాగా, సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన హనుమంతరావు కూడా త్వరలోనే అధికార వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుసగా విఫలమవుతున్న టీడీపీకి.. సీనియర్ నేతలు పార్టీని వీడటం మరో తలనొప్పిగా మారింది. అధిష్టానం పార్టీ పటిష్టత కోసం, పార్టీని వీడకుండా నేతలను అడ్డుకోవడం కోసం చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications