నీ భార్యను పంపిస్తే...: తట్టుకోలేక మిత్రుడ్ని చంపేశాడు
కర్నూలు: భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిని మరో వ్యక్తి చంపేశాడు. తన భర్త గంగదాసు నాగరాజు (45) కనిపించడం లేదని ఓ మహిళ ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే నాగరాజును హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోవడంతో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఈ సంఘటన జరిగింది. సిఐ శ్రీనివాస్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

భర్త కనిపించడం లేదని ఫిర్యాదు...
తన భర్త గంగదాసు నాగరాజు(45) కన్పించడం లేదని బనగానపల్లె బీసీ కాలనీకి చెందిన ప్రమీల అక్టోబర్ 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగరాజును తాను హత్య చేసినట్లు స్థానిక కొండపేట నివాసి గోగు శ్రీనివాసులు పోలీసులకు చెప్పాడు.

వారిద్దరు మంచి స్నేహితులే
నాగరాజు, శ్రీనివాసులు మిత్రులు. ఆరు నెలల క్రితం నాగరాజుకు రూ.15వేలు ఇచ్చి వడ్డీకి తిప్పాలని శ్రీనివాసులు కోరాడు. కొద్ది రోజుల తర్వాత తనకే అవసరం ఉందని ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని శ్రీనివాసులు నాగరాజును కోరాడు. ఇవ్వకపోవడంతో నాగరాజుతో శ్రీనివాసులు ఘర్షణ పడ్డాడు.

డబ్బులు ఇస్తానని తీసుకుని వెళ్లి...
అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం డబ్బులు ఇస్తానని శ్రీనివాసులును నాగరాజు బైక్‌పై ఎక్కించుకుని రవ్వలకొండ సమీపంలో ఉన్న ఎస్సార్బీసీ కట్ట వెంట వెళ్లాడు. ‘నీ భార్యను పంపిస్తే నీ డబ్బు తిరిగి ఇస్తాన'ని నాగరాజు అన్నాడు దీంతో ఆవేశంతో ఊగిపోయిన శ్రీనివాసులు నాగరాజును సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.

ఆ తర్వాత శవాన్ని కాలువలోకి తోసేసి
నాగరాజు మెడలోని బంగారు గొలుసు, ఉంగరాన్ని తీసుకొని, అతడి బైక్, మృతదేహాన్ని ఎస్సార్బీసీ కాలువలోకి తోసేసి శ్రీనివాసులు తన ఇంటికి వచ్చేశాడు.. శ్రీనివాసులు శుక్రవారం స్వయంగా తహసీల్దారు నూకరాజు ఎదుట లొంగిపోయి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.












Click it and Unblock the Notifications