AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి ..కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్.. !
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్ధులైన రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల తర్వాత మరోసారి మాటల యుద్ధం సాగుతోంది. ఇందులో ఒకరు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే మరొకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య చిత్తూరు జిల్లాలో హోరాహోరీ పోరు సాగేది. ఆ తర్వాత ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ వైసీపీ, బీజేపీలోకి వెళ్లిపోయారు. కానీ సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టాయి.
రాజంపేట లోక్ సభ స్ధానానికి ఎన్డీయే ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. గతంలో ఇక్కడ రెండుుసార్లు గెలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిధున్ రెడ్డితో తలపడుతున్నారు. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. తనయుడి తరపున ప్రచారం చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా కిరణ్ ను టార్గెట్ చేశారు. సోనియాగాంధీ కాళ్లు పట్టుకుని సీఎం పదవి తెచ్చుకున్నారని, జగన్ ను జైలుకు పంపారని తీవ్ర విమర్శలు చేశారు.

దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పదవుల కోసం తాను ఎవరి కాళ్లూ పట్టుకోలేదని, పదవుల కోసం ఆత్మగౌరవం చంపుకోవాల్సిన అవసరం తనకు లేదని కిరణ్ స్పష్టం చేశారు. అంతే కాదు గతంలో తన కాళ్లు పట్టుకున్న చరిత్ర పెద్దిరెడ్డిది అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం గెస్ట్ హౌస్ కు వచ్చి పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్న ఘటనను గుర్తుచేశారు. దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. తద్వారా పెద్దిరెడ్డికే ఆత్మగౌరవం లేదని కిరణ్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications