Balayya with Lokesh : మామా, అల్లుళ్ల "గంజాయి వద్దు బ్రో" క్యాంపెయిన్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ఇవాళ శింగనమల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మామ నందమూరి బాలకృష్ణ కూడా ఆయనకు తోడయ్యారు. దీంతో ఇద్దరూ కలిగి గంజాయి వద్దు బ్రో అంటూ ఓ క్యాంపెయిన్ చేపట్టారు. దీంతో ఈ మామా అల్లుళ్ల ప్రచారం ఆసక్తి రేపుతోంది.
శింగనమల నియోజకవర్గంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాదయాత్రలో గంజాయి వద్దు బ్రో అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఇవాళ క్యాంపెయిన్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్న బాలకృష్ణ.. కాసేపు హల్ చల్ చేశారు. గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి యువత కు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ లోకేష్, బాలయ్య మెసేజ్ ఇచ్చారు. గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న టీ షర్టులు, క్యాపులు ధరించిన యువత, టీడీపీ నేతలు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లు సందడి చేశారు.

గంజాయి కి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందంటూ 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతి కి వ్యతిరేకంగా నారా లోకేష్ పోరాటం చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపీ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి తిరుమల ని కూడా వైసిపి గంజాయి మాఫియా వదలడం లేదు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లో గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అని లోకేష్ తెలిపారు.
గంజాయి వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని లోకేష్ తెలిపారు. టీడిపి హయాంలో 40వేల కోట్ల రూపాయిలు విలువ చేసే గంజాయి ని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసిపి నాయకులు గంజాయి పంట వేస్తున్నారన్నారు. పాదయాత్ర లో ఉండగా చంద్రగిరి లో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయి కి బానిస అయ్యింది అని చెప్పిందని, ఆ సంఘటన తనను కలచివేసిందని లోకేష్ తెలిపారు. అందుకే గంజాయి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
టీడీపీ హయాంలో పెట్టిన డిఎడిక్షన్ సెంటర్లు కూడా వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేశారని లోకేష్ ఆరోపించారు. యువత అంతా డ్రగ్స్, గంజాయి కి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నాన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి గంజాయి మాఫియా పై చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి వద్దు బ్రో... యువత గంజాయి కి దూరంగా ఉండాలి అంటూ లోకేష్ పిలుపు ఇచ్చారు..












Click it and Unblock the Notifications