తారకరత్న కోసం బాలయ్య : కదలించిన ఆ తపన - బాధ్యత..!!
తారకరత్న విషయంలో బాలయ్య బాధ్యతగా వ్యవహరించిన తీరును రాజకీయ ప్రత్యర్ధులు అభినందిస్తున్నారు.
తారకరత్న 23 రోజులు మృత్యువుతో పారాడి చివరకు దూరమై విషాదం నింపారు. తారకరత్న కుప్పంలో అస్వస్థతకు గురైన సమయం నుంచి చివరి క్షణం వరకూ కాపాడుకోవటం కోసం నందమూరి బాలకృష్ణ పడిన తపన ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ సమయంలో తారకరత్న పాల్గొన్నారు. అక్కడే గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే బాలయ్య కుప్పంలోని ఆస్పత్రికి తారక రత్నను తరలించారు.
కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో చేర్చిన సమయం నుంచి బాలయ్య పూర్తి బాధ్యత తీసుకున్నారు. వైద్యులతో సంప్రదింపులు..బెంగళూరుకు తరలింపు..బిల్లు చెల్లింపు..కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇస్తూనే..తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. తారకరత్న విషయంలో బాలయ్య బాధ్యతగా వ్యవహరించిన తీరును రాజకీయ ప్రత్యర్ధులు అభినందిస్తున్నారు.

బాబాయ్ గా బాధ్యత తీసుకొని..
తండ్రి తర్వాత తండ్రిగా తారకరత్న బాధ్యతలన్నీ బాలకృష్ణ తీసుకున్నారు. కుప్పంలో ఆస్పత్రిలో అటు లోకేష్ పాదయాత్ర..ఇటు తారకరత్న కు గుండెపోటు వేళ సమర్ధవంతంగా వ్యవహరించారు. తారకరత్న కు చికిత్స విషయంలో వైద్యులతో నిరంతరం టచ్ లో ఉంటూ వారి సూచనలు పాటించారు.
తీవ్ర గుండెపోటు అని నిర్ధారణ కావటంతో వెంటనే బెంగుళూరు నారాయణ హృదయాలయకు తరలించేందుకు చొరవ తీసుకున్నారు. అక్కడ నుంచి వైద్యుల టీం కుప్పంకు వచ్చింది. వారి సమక్షంలోనే ప్రత్యేక అంబులెన్సులో బెంగుళూరు తరలించారు. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా గ్రీన్ ఛానల్ ద్వారా అంబులెన్స్ బెంగుళూరు ఆస్పత్రికి చేర్చటంలో కీలకంగా వ్యవహరించారు.
ఆ సమయంలోనే కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వచ్చారు బాలయ్య. అంతేకాదు.. అభిమానులకు సైతం భరోసా ఇస్తూ కనిపించారు. చంద్రబాబు..జూ ఎన్టీఆర్ సైతం బాలయ్యతో నిరంతర సంప్రదింపుల ద్వారా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసారు.

రాజకీయ ప్రత్యర్ధుల ప్రశంసలు
తారకరత్నను కాపాడుకోవాలని బాలయ్య తపించారు. ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదు. వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసారు. తారకరత్న దక్కలేదు. కానీ, బాలయ్య చేసిన ప్రయత్నాలు.. చివరి నిమిషం వరకు అన్నీ తానై వ్యవహరించిన తీరు మాత్రం ప్రస్తావించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది.
తారకరత్నను బెంగుళూరు ఆస్పత్రిలో చేర్చిన తరువాత బాలయ్య కేవలం రెండు సార్లు మాత్రమే తన ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. ప్రతీ గంట ఆస్పత్రిలోని వైద్యులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి వాకబు చేసారు. అటు కుటుంబ సభ్యులు ఓదార్పు ఇచ్చారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా తాపత్రయపడ్డారు.
ఇన్ని రోజులు తారకరత్నకు అన్నీ తానై అండగా ఉన్న బాలయ్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తారకరత్న వైద్యం విషయంలో బాలయ్య ప్రయత్నాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ప్రశంసించారు. ఇద్దరూ ఫోన్ లో తారకరత్న ఆరోగ్యం గురించి చర్చించారు.

మనోనిబ్బరం .. భరోసా
ఆందోళనలో ఉన్న తన అన్న కుటుంబానికి..తారకరత్న సతీమణి..పిల్లలకు బాలయ్య భరోసా గా నిలిచారు. బాలయ్యకు జరుగుతున్న చికిత్స..ఫలితాల గురించి తెలిసినా మనో నిబ్బరంతో వ్యవహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తారకరత్న గురించి బాలయ్యతో వాకబు చేసారు.
ఇప్పటి వరకు బాలయ్య లోని ఆవేశం.. కాంట్రావర్సీ మాటలే చూసిన వారంతా ఇప్పుడు బాలయ్య లో మరో కోణం అంటూ పోస్టింగ్స్ చేస్తున్నారు. తారకరత్నకు సినిమాల్లో ప్రోత్సహించిన బాలయ్య..చికిత్స తీసుకుంటున్న సమయంలోనూ అండగా నిలిచారు. కానీ, ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు.
23 రోజులు ఆస్పత్రిలోనే మృత్యువుతో పోరాడిన తారకరత్న కన్నుమూసారు. ఇప్పుడు ఇది నందమూరి కుటుంబంతో పాటుగా అభిమానుల్లోనూ విషాదాన్ని మిగిల్చింది.












Click it and Unblock the Notifications